మహిళా సంఘాల సభ్యులకు రెండేసి చీరెలు

మహిళా సంఘాల సభ్యులకు రెండేసి చీరెలు
  • 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కారు నిర్ణయం
  • మంత్రి సీతక్కకు డిజైన్డ్​ శారీలను చూపించిన అధికారులు
  • సీఎం రేవంత్ రెడ్డిసమక్షంలో త్వరలో  ఫైనలైజ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సెల్ఫ్​ హెల్ప్​ గ్రూప్​ (ఎస్​హెచ్​జీ) సభ్యులకు చీరెలను పంపిణీ చేసేందుకు  ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 63 లక్షల మందికి పైగా మహిళలకు రెండేసి చీరెలు అందించనున్నది.  ఇప్పటికే వీటి డిజైన్ల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నది. గురువారం సచివాలయంలో  మంత్రి సీతక్క కు  ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్డ్​  చీరెలను సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్  చూపించారు.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో యూనిఫాం చీరెలను ఫైనలైజ్ చేయనున్నట్టు తెలిసింది. అనంతరం వాటిని మహిళలకు పంపిణీ చేయనున్నారు.  తెలంగాణలో విజయవంతమైన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం లోగో, రంగులతో ఆకర్షణీయంగా యూనిఫాం చీరెలు రూపొందించినట్టు తెలిసింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు  ఇచ్చే యూనిఫాం చీరెలను మంత్రి సీతక్కకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ  చూపించారు.  ఈ చీరెలకు సంబంధించి మంత్రి పలు సూచనలు చేశారు. 

‘వన్ కార్పొరేట్.. వన్ విలేజ్ అడాప్షన్’ గొప్ప నిర్ణయం : మంత్రి సీతక్క

కార్పొరేట్ సంస్థలు పల్లె ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాలని, ‘వన్ కార్పొరేట్.. వన్ విలేజ్ అడాప్షన్’  మంచి నిర్ణయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన వంటి అంశాలపై పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘నిర్మాణ్ - సోషల్ ఇంపాక్ట్ కాన్ క్లేవ్ 4.O’ కార్యక్రమానికి మంత్రి  సీతక్క ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.  కార్పొరేట్లకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న నిర్మాణ్ సంస్థకు, టీంకు  అభినందనలు తెలిపారు.

కష్టాన్ని ఇష్టంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి  నిర్మాణ్ సంస్థ నిదర్శనమని చెప్పారు. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. 17 రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లను, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళలకు కేటాయిస్తున్నామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో సాంకేతిక వెనుకబాటును రూపుమాపేలా  ఐటీ సంస్థలు పనిచేయాలని కోరారు.