బరిలోకి కుర్రాళ్లు!..మూడో టెస్టులో సర్ఫరాజ్, జురెల్

బరిలోకి కుర్రాళ్లు!..మూడో టెస్టులో సర్ఫరాజ్, జురెల్
  • అరంగేట్రం చేసే అవకాశం
  • జడేజా ఫిట్.. ప్రాక్టీస్‌కు గిల్ డుమ్మా

రాజ్‌‌కోట్: ఇంగ్లండ్‌‌తో తొలి మ్యాచ్‌‌లో ఓటమి నుంచి వెంటనే తేరుకొని వైజాగ్‌‌లో లెక్కసరిచేసిన టీమిండియా మూడో టెస్టు కోసం రెడీ అవుతోంది. పలువురు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరం అవ్వడంతో ఈ మ్యాచ్‌‌లో డొమెస్టిక్ రన్ మెషీన్‌‌ సర్ఫరాజ్ ఖాన్‌‌, హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపర్‌‌‌‌ ధ్రువ్ జురెల్‌‌ను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ‌‌

వైజాగ్‌‌ మ్యాచ్‌‌ తర్వాత వారానికి పైగా గ్రౌండ్‌‌కు దూరంగా ఉన్న రోహిత్‌‌ సేన రాజ్‌‌కోట్‌‌లో గురువారం నుంచి జరిగే మ్యాచ్‌‌ కోసం ప్రాక్టీస్ షురూ చేసింది. మంగళవారం జరిగిన అప్షనల్ సెషన్‌‌లో  క్రికెటర్లు చెమటలు చిందించారు. గత మ్యాచ్‌‌లో సెంచరీ కొట్టిన శుభ్‌‌మన్ గిల్ ప్రాక్టీస్‌‌కు దూరంగా ఉన్నాడు. వైజాగ్‌‌లో అతని చేతి వేలికి గాయమైంది. ఇది అంత తీవ్రమైనది కాకపోయినా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌‌లో ఫీల్డింగ్‌‌కు అతను దూరంగా ఉన్నాడు.  

శ్రేయస్‌‌ అయ్యర్‌‌‌‌పై వేటు పడగా.. కండరాల నొప్పి నుంచి ఇంకా కోలుకోని కేఎల్‌‌ రాహుల్‌‌ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డొమెస్టిక్‌‌లో దంచికొడుతున్న సర్ఫరాజ్‌‌కు తుది జట్టులో తలుపులు తెరుచుకున్నట్టు అయింది. మరోవైపు కీపర్ శ్రీకర్ భరత్‌‌ పేలవ ఫామ్‌‌లో ఉన్నాడు. ఏడు టెస్టుల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయని అతని స్థానంలో  హైక్వాలిటీ బ్యాటర్ అయిన జురెల్‌‌ను కీపర్‌‌‌‌గా ఆడించాలని మేనేజ్‌‌మెంట్ భావిస్తోంది.

అదే జరిగితే రెండో టెస్టులో అరంగేట్రం చేసిన రజత్‌‌ పటీదార్‌‌‌‌, సర్ఫరాజ్‌‌, జురెల్‌‌   4–7 స్థానాల మధ్యలో రవీంద్ర జడేజాతో కలిసి  మిడిలార్డర్‌‌‌‌ బాధ్యతలు అందుకోనున్నారు. పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో జడేజా కూడా తుది జట్టులోకి వస్తే మిడిలార్డర్‌‌‌‌ బలోపేతం కానుంది. ప్రస్తుతం ఇండియా టెస్టు జట్టు సంధికాలంలో ఉంది. కోహ్లీ టీమ్‌‌కు దూరంగా ఉన్నా, కేఎల్‌‌, అయ్యర్ గాయాల పాలైనా రంజీల్లో రాణిస్తున్న  వెటరన్‌‌ చతేశ్వర్ పుజారా, మరో సీనియర్ అజింక్యా రహానెను సెలెక్టర్లు జట్టులోకి తిరిగి తీసుకోలేదు. యంగ్‌‌స్టర్స్‌‌ రజత్, సర్ఫరాజ్‌‌, జురెల్‌‌ను ఎంపిక చేయడం చూస్తే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తవారిని  తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు స్పష్టం అవుతోంది.

ప్రాక్టీస్‌‌లో వాళ్లపైనే ఫోకస్

ప్రాక్టీస్ సెషన్‌‌లో జురెల్, సర్ఫరాజ్‌‌తో పాటు మరో యంగ్‌‌ స్టర్‌‌‌‌ రజత్‌‌ పటీదార్ స్పెషల్ ఎట్రాక్షన్‌‌గా నిలిచారు. ముఖ్యంగా  స్లిప్‌‌ కార్డన్‌‌ సరికొత్తగా కనిపిస్తోంది.  సర్ఫరాజ్‌‌ ఫస్ట్ స్లిప్‌‌లో, రజత్ గల్లీలో స్లిప్  క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు.  రెండో స్లిప్‌‌లో మరో యంగ్‌‌స్టర్‌‌‌‌ యశస్వి జైస్వాల్ ఉండగా.. వికెట్ల వెనకాల కీపర్‌‌‌‌ జురెల్ షార్ప్ క్యాచ్‌‌లు అందుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మరోవైపు  గ్రౌండ్‌‌లోకి రాగానే  కెప్టెన్‌‌ రోహిత్, కోచ్ ద్రవిడ్‌‌తో కలిసి పిచ్‌‌ను పరిశీలించాడు. ఆ వెంటనే క్యాచింగ్ ప్రాక్టీస్‌‌లో జాయిన్ అయ్యాడు. స్లిప్ క్యాచింగ్ సెషన్ పూర్తయిన వెంటనే పటీదార్‌‌‌‌, సర్ఫరాజ్ సిల్లీ పాయింట్, షార్ట్‌‌ లెగ్‌‌లోనూ క్యాచ్‌‌లు అందుకోవడం చూస్తుంటే తర్వాతి మ్యాచ్‌‌లకు వీళ్లకు టీమ్ మేనేజ్‌‌మెంట్ స్పష్టమైన పాత్రను అప్పగించినట్టు కనిపిస్తోంది.

అనంతరం కెప్టెన్ రోహిత్‌‌తో పాటు ఈ ఇద్దరూ నెట్స్‌‌లోకి వెళ్లి లోకల్‌‌ బౌలర్లు, ఇండియా స్పిన్నర్లు, త్రోడౌన్ స్పెషలిస్టులను ఎదుర్కొన్నారు. పక్కనెట్స్‌‌లో కేఎస్ భరత్ ఒంటరిగా ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు ఆల్‌‌రౌండర్ జడేజా చాలా సేపు బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్‌‌ కూడా ప్రాక్టీస్ చేశాడు. అతను ఫుల్ ఫిట్‌‌నెస్ సాధించినట్టు అర్థం అవుతోంది. ఇక, పేస్‌‌ లీడర్‌‌‌‌ జస్‌‌ప్రీత్ బుమ్రా, బెంగాల్ యంగ్ పేసర్‌‌‌‌ ఆకాశ్ దీప్‌‌తో పాటు  రాహుల్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌గా ఎంపికైన దేవదత్‌‌ పడిక్కల్ మంగళవారం సాయంత్రం జట్టుతో కలిశారు.