Irani Cup 2024: డబుల్ సెంచరీతో దంచి కొట్టిన సర్ఫరాజ్.. ఇరానీ ట్రోఫీలో ముంబై భారీ స్కోర్

ఇరానీ ట్రోఫీలో సర్ఫరాజ్ డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. భారత జట్టు నుంచి ఇరానీ కప్ కోసం ముంబై జట్టులో చేరిన సర్ఫరాజ్.. ఏకంగా డబుల్ సెంచరీ (221*)తో అదరగొట్టాడు. 253 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్ అందుకొని ముంబై భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్ లో 23 ఫోర్లతో పాటు 3 సిక్సర్లు ఉన్నాయి. హాఫ్ సెంచరీ చేసి రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఈ 26 ఏళ్ళ బ్యాటర్ తన జోరును కొనసాగించాడు. మరో ఎండ్ లో కొటియాన్ సహాయంతో సెంచరీ.. 150 పరుగుల మార్క్ తో పాటు డబుల్ సెంచరీ చేశాడు.

దేశవాళీ క్రికెట్ లో అసాధారణ ఫామ్ తో భారత జట్టులోకి చోటు దక్కించుకొని తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలతో తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నా తుది జట్టులో అవకాశం రాలేదు. దీంతో ఓ వైపు భారత్ రెండో టెస్ట్ ఆడుతున్నప్పుడే సర్ఫరాజ్ ఇరానీ కప్ కోసం భారత స్క్వాడ్ నుంచి రిలీజ్ చేయబడ్డాడు. తనకు అచొచ్చిన డొమెస్టిక్ క్రికెట్ లో చెలరేగుతున్నాడు. 

ALSO READ | Irani Cup: పక్షిలా విన్యాసం.. మతి పోగొడుతున్న పడిక్కల్ స్టన్నింగ్ క్యాచ్

ప్రస్తుతం ముంబై రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. క్రీజ్ లో సర్ఫరాజ్ (221), జునెడ్ ఖాన్ (0) ఉన్నారు. కెప్టెన్ అజింక్య రహానే  97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి రోజు అయ్యర్ 57 పరుగులు చేసి రాణించాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ కృష్ణ, యాష్ దయాల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.