లక్నో: ముంబై సూపర్ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (276 బాల్స్‌లో 25 ఫోర్లు, 4 సిక్స్‌లతో 221 నాటౌట్) ఇరానీ ట్రోఫీలో దుమ్మురేపాడు. గతంలో ముంబై తరఫున ఎవరికీ సాధ్యం కానీ డబుల్ సెంచరీతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఈ పోరులో బుధవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 138 ఓవర్లలో 536/9 స్కోరు చేసింది.
సర్ఫరాజ్‌తో పాటు జునేద్ ఖాన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 237/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రహానె (97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్‌తో ఐదో వికెట్‌కు 131 రన్స్ జోడించి ఔటయ్యాడు. ఇక్కడి నుంచి సర్ఫరాజ్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. తనుష్ కొటియాన్ (64)తో ఏడో వికెట్‌కు 183, శార్దూల్ ఠాకూర్ (36)తో తొమ్మిదో వికెట్‌కు 73 రన్స్ జోడించాడు. శామ్స్ ములానీ (5), మోహిత్ అవాస్తి (0) నిరాశపర్చారు. ముకేశ్ కుమార్ 4, యష్ దయాల్, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. గతంలో రెస్టాఫ్ ఇండియా తరఫున వసీమ్ జాఫర్, రవి శాస్త్రి, ప్రవీణ్ ఆమ్రే, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీలు చేశారు.