
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత(Singer Sunitha) కొడుకు ఆకాష్(Akash) హీరోగా చేసిన తొలి చిత్రం సర్కారు నౌకరి(Sarkaaru Noukari). దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను గంగనమోని శేఖర్ తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తరువాత మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కొత్త సంవత్సరం సందర్భంగా నేడు(జనవరి 1, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సర్కారు నౌకరి కథ 1996లో సాగుతుంది. గోపాల్(ఆకాష్ గోపరాజు) ఒక అనాథ. అతనికి చదువంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. ఆ కారణంగా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి హెల్త్ ప్రమోటర్‌గా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ, కండోమ్స్ పంపిణీ చేయడం అతని డ్యూటీ. కొంతకాలానికి సత్య(భావన)తో గోపాల్ పెళ్లి జరుగుతుంది.
ముందు ఆ గ్రామ ప్రజలు గోపాల్ ను బాగానే గౌరవిస్తారు కానీ.. అతని పని కండోమ్‌లు పంచడం అని తెలిశాక వారిని అంటరాని వాళ్లుగా చూస్తారు, బుగ్గలోడు అంటూహేళన చేస్తారు ఊరి జనం. ఆ అవమానాలు భరించలేని గోపాల్ భార్య.. ఉద్యోగం మానేసి వేరే ఊరికి వెళ్దామని కోరుతుంది కానీ.. గోపాల్ మాత్రం ఉద్యోగం మానలేనినని చెప్తాడు. ఆ తరువాత ఎం జరిగింది? గోపాల్ తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయలేదు? ఎయిడ్స్ పై అవగాహన కోసం గోపాల్ ఎం చేశాడు? గోపాల్ గతమేంటి? కొల్లాపూర్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేది సర్కారు నౌకరి కథ.
విశ్లేషణ:
సర్కారు నౌకరి సినిమా కథ 1996లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్. ఆ కాలంలో ఎయిడ్స్ వ్యాధి ప్రభావం, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, ఎయిడ్స్ బారిన పడిన వారిని ఊరి నుంచి వెలివేయడం వంటి సన్నివేశాలను చాలా సహజంగా చూపించాడు దర్శకుడు. ఆ నేపధ్యంలో ఓ మంచి సందేశాన్ని, హాస్యాన్ని, భావోద్వేగాల్ని చాలా బాగా పండించాడు. గ్రామీణ నేపధ్యం, మన చుట్టు జరిగిన సంఘటనలు తెరపై చూస్తుంటే.. ఇది సినిమా అనే ఫీలింగ్ కలగదు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తాయి.
ఇక ఫస్టాఫ్ కామెడీగా సాగినా.. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. గంగ(మధులత)-శివ(మహదేవ్)ల మధ్య వచ్చే సన్నివేశాలు, పాట హత్తుకుంటాయి. అలాగే హీరో గోపాల్ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే కథా, కథనాలు బాగున్నా కనెక్టింగ్ సీన్స్ లేకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఎయిడ్స్‌పై అవగాహన కల్సించడం కోసం హీరో చేసే ప్రయత్నాలు ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ.. దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను చాలా నిజాయితీగా చెప్పాడు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
తొలి సినిమా అయినప్పటికీ హీరో ఆకాశ్ చాలా బాగా నటించాడు. చాలా సహజంగా కనిపిస్తూ.. పాత్రకు తగ్గ హవభావాలను పలికించాడు. మొదటి సినిమానే ఇలాంటి కథను ఎంచుకోవడం కాస్త కష్టమే అయినా కూడా బాగా మెప్పించాడు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలల్లో ఒదిగిపోయాడు. ఇక సత్యగా భావన కూడా చాలా సహజంగా కనిపించింది. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక శివగా మహదేవ్, గంగగా మధు లత, కొల్లాపూర్ సర్పంచ్‌గా తనికెళ్ల భరణి, బలగం సుధాకర్ రెడ్డి, సాహితి దాసరి, సమ్మెట గాంధీ తదితరులు కూడా తమ పాత్రల మేరకు నటించారు. ఇక సాంకేతికనిపుణుల విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది. శాండిల్య అందించిన పాటలు కూడా ఆకట్టుకుంటాయి.కెమెరామెన్ శేకర్ గంగనమోని వర్క్ బాగుంది. సినిమా మూడ్ కి తగ్గట్టుగా పల్లెటూరి వాతావరణాన్ని అందంగా తెరపై ఆవిష్కరించాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఇక ఒక్కముక్కలో సర్కారు నౌకరి సినిమా గురించి చెప్పాలంటే.. సహజంగా సాగే అందమైన కథ. హృదయాల్ని హత్తుకుంటుంది.