- గత సర్కార్ పెద్దల అండతో చెలరేగిన మట్టి మాఫియా
- ఈ ఏడాది కూడా తవ్వకాలకు రెడీ అవుతున్న కాంట్రాక్టర్లు
- ఒకే వే బిల్లుతో నాలుగైదు ట్రిప్పులు
- రూ. కోట్లు ఖజానాకు గండి
పెద్దపల్లి, వెలుగు: చెరువుల్లో మట్టి తవ్వకాల్లో సర్కార్ గైడ్‌లైన్స్ ఎక్కడా అమలుకావడంలేదు. దీంతో అక్రమార్కులు చెరువులను చెరపడుతున్నారు. గత సర్కార్ హయాం నుంచి కొనసాగుతున్న తవ్వకాలు ఈ ఏడాది కొనసాగించేందుకు అక్రమార్కులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో మిషన్ కాకతీయను అడ్డం పెట్టుకొని కొన్నేండ్లుగా చెరువుల్లో మట్టి తవ్వి ఇటుకబట్టీలకు, ఇతర నిర్మాణాలకు అమ్ముకున్నారు. చెరువుల రిపేర్ల పేరు మీద పర్మిషన్లకు మించి తోలారు. ఒక 'వే' బిల్లుతో నాలుగైదు ట్రిప్పుల మట్టిని తరలించుకుపోయారు. ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దలుండడంతో ఆఫీసర్లు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కాగా మట్టి తవ్వకాలకు సంబంధించి ఈసారి కొత్త గైడ్ లైన్స్ ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
భారీగా ఇటుక బట్టీలకే..
పెద్దపల్లి జిల్లా ఇటుక బట్టీలకు హబ్‌గా మారింది. ఇక్కడ నుంచి కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా ఇటుకలు సప్లయ్ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీలు 130 వరకు ఉన్నాయి. ఇటుకల తయారీకి అవసరమైన మట్టితో పాటు ఎన్టీపీసీలో యాష్ మిక్స్ కూడా ఇక్కడే దొరుకుతుండడంతో ఇటుక బట్టీలు భారీగా ఏర్పాటయ్యాయి. ఎండాకాలం రాగానే చెరువుల్లో నీటిమట్టాలు పడిపోతుంటాయి.
ఇదే అదునుగా మట్టి తవ్వకాలు మొదలుపెడుతారు. ప్రతీ ఏటా ఇటుక బట్టీ యజమానులు సర్కారుకు నామమాత్రంగా సీనరేజి చెల్లిస్తున్నారు. ఇటుకబట్టీ యజమానులు మట్టి తరలించే వ్యవహారంలో కొంతమంది అధికారులు, రాజకీయ నాయకుల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ మట్టి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పర్మిషన్‌కు మించి తరలింపు
అక్రమార్కులకు మట్టి తోలకాలు ఆదాయ వనరుగా మారాయి. గత సర్కార్ హయాంలో చెరువుల పునరుద్ధరణ పేరిట మిషన్ కాకతీయ ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అనుమతించిన క్యూబిక్ మీటర్లు వరకు మాత్రమే మట్టి తీసి ట్రాక్టర్ల ద్వారా రైతుల పొలాల్లో డంప్ చేయాల్సి ఉంది. కాగా రూల్స్‌కు విరుద్ధంగా ప్రొక్లయిన్ల సాయంతో టిప్పర్లతో ఇష్టారీతిన ఇటుక బట్టీలకు, ఇతర నిర్మాణాలకు తరలించారు.
మైనింగ్ డిపార్ట్‌మెంట్‌కు ఎంతో కొంత సీనరేజీ చెల్లించి వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తోలారు. మట్టి తవ్వడానికి పర్మిషన్ ఉన్న ఇద్దరు, ముగ్గురు ఇటుక బట్టీల యజమానుల పేరు మీద జిల్లా మొత్తానికి మట్టి సప్లై చేసినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ప్రజలు అడ్డుకొని ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ వ్యవహారం మొత్తం అధికారుల కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలున్నాయి.