ఉద్యోగుల్ని అణగదొక్కిన సర్కార్లు కూలినయ్​

ఉద్యోగుల్ని అణగదొక్కిన సర్కార్లు కూలినయ్​

హక్కుల సాధనలో చివరి ఆయుధం సమ్మె.  తమ న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ఉద్యోగులు, కార్మికులు, టీచర్లు స్ట్రయిక్​ చేస్తారు. సమ్మెలను ప్రభుత్వం అణచివేయొచ్చు. సమ్మెకు దిగినవాళ్లు స్ట్రయిక్​ పీరియడ్​లో జీతం నష్టపోయి, అనుకున్నవి సాధించలేక ఓడిపోవచ్చు. అంతమాత్రాన వాళ్లది గెలుపు కాదు, వీళ్లది ఓటమి కాదు. సమ్మె కాలపు పర్యవసానం తర్వాత జరిగిన ఎన్నికల్లో తప్పకుండా పడుతుంది. ఇండియా చరిత్రలోనే అతి పెద్ద సమ్మెగా 1974నాటి రైల్వే స్ట్రయిక్​ని చెబుతారు. జార్జి ఫెర్నాండెజ్​ నాయకత్వంలో 17 లక్షలమంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు దిగారు. 20 రోజులపాటు జరిగిన స్ట్రయిక్​ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేసింది.  అయితే, ఇందిర ప్రభుత్వం ఆ తర్వాత మూడేళ్లకే 1977 ఎలక్షన్స్​లో కుప్పకూలింది.

డాక్టర్​ మర్రి చెన్నారెడ్డి 1978లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే అసిస్టెంట్​ సివిల్​సర్జన్లు, జూనియర్​ డాక్టర్లు స్ట్రయిక్​ చేశారు. వాళ్ల డిమాండ్లను పట్టించుకోకుండా అణచి వేశారు. ఇది జరిగిన రెండేళ్లకే 1980లో ఆయన సీఎం కుర్చీ వదులుకోవలసి వచ్చింది. రెండోసారి 1985 ఎన్నికల్లో మళ్లీ సీఎం అయినా ఎన్టీఆర్ తీరు మారలేదు. 1986 నవంబర్​లో ఉద్యోగ, టీచర్​, కార్మిక పోరాట సమితి స్ట్రయిక్​కి దిగింది. డిసెంబర్​ వరకు 53 రోజుల పాటు రాష్ట్రం స్తంభించింది. చివరకు ఉద్యోగులే మెట్టు దిగాల్సి వచ్చింది.  ఇది జరిగిన మూడేళ్లకే 1989 ఎన్టీఆర్​ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.

జయలలిత 2002లో సీఎం కుర్చీ ఎక్కాక ఉద్యోగులు, టీచర్లపై కత్తి కట్టారు. 2003లో10 లక్షలకు పైగా సిబ్బంది సమ్మెకు దిగారు. వాళ్లపై జయ ప్రభుత్వం టెస్మా ఆర్డినెన్స్​ ప్రయోగించి లక్షా 76 వేల మందిని ఉద్యోగాలనుంచి తొలగించింది. సుప్రీం సలహాతో వాళ్లను మళ్లీ తీసుకుంది. కానీ, ఇది జరిగిన మూడేళ్లకు 2006 ఎన్నికల్లో జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓటమి పాలయ్యింది. చరిత్ర చెబుతున్న ప్రకారం…  ప్రభుత్వానికి రథ చక్రాలు ఉద్యోగులు, కార్మికులే. వీళ్లకు కల్పించాల్సిన సౌలతులను పట్టించుకోకపోతే అసమ్మతి రగులుతుంది. ప్రభుత్వాలను మార్చేయగల అగ్గి రాజుకుంటుందని ఎనలిస్టులు అంటున్నారు.