![భారత కోకిల సరోజినీ నాయుడు](https://static.v6velugu.com/uploads/2025/02/sarojini-naidu-birth-day-on-february-13th-specical-story-of-telangana-gazetted-officers-union-publicty-secretrary-asnala-srinivas_xdlE3OFSDH.jpg)
స్వాతంత్య్రోద్యమ సంకుల సమర వేదికపై అరుదైన సాంస్కృతిక ప్రతిభా పాండిత్యాల మేలుకలయికగా భాసిల్లిన బహుముఖ ప్రజ్ఞాశీలి సరోజినీ నాయుడు. ఫిబ్రవరి 13న ఆమె జయంతి. తెలంగాణ స్వేదసౌధం హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన గులాబీ రెమ్మ సరోజినీదేవి నాయుడు. ప్రకృతిపై భావ యుక్త పాటల సృజనకుగాను భారత కోకిలగా ఆమె ప్రాచుర్యం పొందారు. జాతీయోద్యమ నేతగా, ఉత్తేజకర వక్తగా దేశ చరిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు.
1904 బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరై ఉత్తేజం పొందిన సరోజినీ నాయుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా, బెంగాల్ ఐక్యత కోసం పెల్లుబికిన విప్లవ పోరాటంలో పాల్గొని తన పోరాట ప్రస్థానాన్ని ప్రారంభించారు. గాంధీ, నెహ్రూ, జిన్నా, గోఖలే వంటి అగ్రనేతలతో సమానంగా ఆమె పనిచేశారు. చంపారన్ నీలిమందు రైతుల పోరాటంలో పాల్గొన్నారు. 1917 నుంచి-1919 వరకు దేశమంతా పర్యటించి సామాజిక న్యాయం, స్వయం పాలనపై ప్రజలను తన ప్రసంగాలతో చైతన్యపరిచారు. 1917లో భారతీయ మహిళా సంఘాన్ని స్థాపించి మహిళలపై జరుగుతున్న అణచివేత నుంచి విముక్తి కోసం, న్యాయం ఒక హక్కుగా అందించడానికి బాధ్యతతో పని చేశారు.
లక్నో ఒప్పందంలో కీలకపాత్ర వహించి హిందూ, ముస్లిం ఐక్యతకు కృషి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టై 3 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీ అరెస్ట్ తర్వాత వేలాది మంది వాలంటీర్లతో ఆ ఉద్యమాన్ని నడిపించారు.
కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా...
1924లో హోమ్ రూల్ లీగ్ ఉద్యమ దౌత్యవేత్తగా నియమితులయ్యారు. 1925 కాన్పూర్ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ప్రసంగం చేస్తూ .. ‘నేను మీ హృదయాలను ఎలా కదిలించగలను, ఆరిపోని అగ్నిజ్వాలను ఎలా వెలిగించగలను, మన బానిసత్వం, మన అనైక్యత, మన ఆకలి, నిరాశను, మనపై జరుగుతున్న పాశవిక అణచివేత.. ఆరని అగ్నిజ్వాలలో కాలిపోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ సదస్సులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం కార్యకర్తలు, ప్రజలపై విశేష ప్రభావం చూపింది.
సాహిత్య, సంస్కృతుల వేదిక గోల్డెన్ థ్రెషోల్డ్
ఉత్తరప్రదేశ్‌కు సరోజినీ నాయుడు గవర్నర్‌గా పని చేశారు. తను స్వాతంత్ర్యోద్యమంలో మితవాద మార్గాన్ని ఎంచుకుంటే ఆమె సోదరి సుహాసినీ చటోపాధ్యాయ కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన తొలి మహిళగా నిలిచి సమరశీల పోరాటాలకు నేతృత్వం వహించారు. మరో సోదరుడు వీరేంద్రనాథ్ అతివాద పంథాను ఎంచుకుని లాలా లజపతి రాయ్ సహచరుడిగా, మెక్సికన్ మహిళ ఆగ్నెస్ స్మెడ్లిని వివాహమాడి అమెరికా, జర్మనీ కేంద్రంగా విప్లవాత్మక కార్యక్రమాలు నిర్వహించాడు.
తల్లిదండ్రులు అఘోరనాథ చటోపాధ్యాయ, వరదా దేవిలను విద్యా విస్తరణకు, మహిళా విద్యా కేంద్రాల స్థాపన కోసం బెంగాల్ నుంచి నిజాం రాజు ఆహ్వానించాడు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆమె తండ్రి పని చేశారు. తల్లి బాలికా విద్యాలయాన్ని నాంపల్లిలో స్థాపించారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 13, 1879లో పుట్టి పెరిగి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని అద్వితీయ ప్రతిభ ఉన్న సరోజినీ ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు.
అక్కడ పరిచయమైన సహాధ్యాయి గోపాలనాయుడిని హైదరాబాద్‌లో కందుకూరి వీరేశలింగం సహకారంతో పెండ్లి చేసుకున్నారు. అబిడ్స్ లోని సరోజినీ నాయుడు నివాసం గోల్డెన్ థ్రెషోల్డ్సాహిత్య, సంస్కృతుల సంగమ వేదికగా నిలిచింది. కేంద్రీయ విశ్వ విద్యాలయం తొలి రోజులలో ఇక్కడే ఏర్పాటయింది. దేశ ప్రజల సహోదరత్వం కోసం, స్వాతంత్ర్యం కోసం తెలంగాణ జీవన వికాసం కోసం, సంస్కృతికి, సాహిత్యానికి సరోజినీ నాయుడు, ఆమె కుటుంబం చేసిన సేవలను నేడు తలుచుకుందాం.
- అస్నాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం–