ఆదర్శ మహిళా సర్పంచ్‌‌గా ఆశాబాయి

ఆదర్శ మహిళా సర్పంచ్‌‌గా ఆశాబాయి

భర్తను కాపాడుకోవడం కోసం భార్య తన నగలన్నీ అమ్మేయడం చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఊరి బాగు కోసం తన సొంత నగలను తాకట్టు పెట్టిన సర్పంచ్‌‌ను చూసుండరు. అందుకే జిరి గ్రామ సర్పంచ్ ఆశాబాయి చేసిన ఓ పనికి ఆ ఊరి వాళ్లంతా శెభాష్​​ అంటున్నారు.

మధ్యప్రదేశ్‌‌లోని బుర్హాన్‌‌పూర్‌‌ జిల్లా జిరి గ్రామంలో దొంగతనాలు, కిడ్నాప్‌‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ దొంగలను పట్టుకోవడానికి పోలీసులకు ఎలాంటి ఆధారాలు ఉండేవి కావు. గ్రామంలో ఈ సమస్య ఎక్కువ అవ్వడంతో పంచాయతీకి కొత్త సర్పంచ్‌‌గా ఎన్నికైన ఆశాబాయి కైత్వాస్ ఎలాగైనా గ్రామానికి సీసీ కెమెరాలు పెట్టించాలనుకుంది. దానికోసం సరిపడా ఫండ్స్ లేకపోవడంతో తన సొంత నగలను తాకట్టు పెట్టి రూ.80 వేలు పోగుచేసింది. వాటితో నాలుగు హెచ్‌‌డీ క్వాలిటీ సీసీటీవీ కెమెరాలను కొని, ఊరి నాలుగు మూలలా పెట్టించింది. 

సీసీటీవీలు పెట్టిన కొన్నిరోజులకే ఊర్లో ఒక చిన్న పాప కిడ్నాప్ అయింది. అయితే ఈసారి  సీసీటీవీలు ఉండడంతో పోలీసులు 72 గంటల్లోనే కిడ్నాపర్స్​ని పట్టుకున్నారు. దాంతో ఊళ్లో వాళ్లంతా ఆశాబాయి చేసిన పనిని మెచ్చు కుంటున్నారు. అలా జిల్లాకే తొలి ఆదర్శ మహిళా సర్పంచ్‌‌గా ఆశాబాయి గుర్తింపు పొందింది.