ఈ సర్పంచ్ ఎవడండీ బాబూ : రోడ్లపై పశువులు తిరిగితే చెప్పు దెబ్బలు, రూ.500 ఫైన్..

ఈ సర్పంచ్ ఎవడండీ బాబూ : రోడ్లపై పశువులు తిరిగితే చెప్పు దెబ్బలు, రూ.500 ఫైన్..

గ్రామాల్లో రోడ్లపై పశువులు తిరుగుతుండడం మనం రోజు చూస్తూనే ఉంటాం. వాటి పేడ తీసుకుని వాకిలి ముందు సంపు చల్లుతారు. కొందరైతే పశువుల పేడను ఎరువులుగా కూడా వాడుతుంటారు. మనదేశంలో పశువులను ఆరాధ్యదైవంగా కొలుస్తారు. అలాంటి పశువులు రోడ్లపై తిరగవద్దని హుకుం జారీ చేశాడో గ్రామ సర్పంచ్. అంతేకాదు.. పశువులు రోడ్లపై తిరిగితే వాటి యజమానికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా విధిస్తామని గ్రామంలో డప్పు చాటింపు వేయించాడు సదరు సర్పంచ్. సర్పంచ్ ఆదేశాన్ని ఒక వ్యక్తి సైకిల్ పై ప్రతి ఇంటింటికీ వెళ్లి.. డ్రమ్ ను వాయిస్తూ చాటింపు చేశాడు. 

ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలో జరిగింది. గ్రామంలో స్వేచ్చగా పశువులు తిరగొద్దని హెచ్చరిక జారీ చేశాడు నగ్నాదుయ్ సర్పంచ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నిబంధనను గ్రామంలో పాటించని వారికి శిక్ష తప్పదని కొత్త హెచ్చరిక జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తమ గ్రామంలో పశువుల స్వేచ్ఛా సంచారం వల్ల వీధులన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయని, వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోందని.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నగ్నదుయ్ సర్పంచ్‌ చెబుతున్నాడు. గ్రామ సర్పంచ్ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

https://twitter.com/RaviTripathi25/status/1682250612287901701