
రామడుగు, వెలుగు: తమ గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆఫీసర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని రామడుగు మండలం వన్నారం సర్పంచ్ జాడి లక్ష్మి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శుక్రవారం పంచాయతీ ఆఫీసు డోర్లు వేసుకొని స్వీయ నిర్బంధం విధించుకున్నారు. వన్నారం పక్కనే ఉన్న వాగులోంచి నిత్యం 200కు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రావాణా చేస్తున్నారని ఇదివరకే కలెక్టర్‌తో పాటు తహసీల్దార్, ఎస్ఐ, మైనింగ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోకపోవడంతో స్వీయనిర్బంధం విధించుకున్నట్టు సర్పంచ్ చెప్పారు. రామడుగు ఎస్ఐ అంజయ్య అక్కడికి వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటానని హామీ ఇవ్వడంతో తలుపులు తీసి బయటకు వచ్చారు.