ఇండ్ల స్థలాల పంపిణీపై ఆఫీసర్ల తీరుకు సర్పంచ్​, పంచాయతీ పాలకవర్గం నిరసన

రామడుగు, వెలుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్​రావుపేటలో గ్రామసభ నిర్వహించకుండానే ఇండ్ల స్థలాలకు లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు నిరసనగా సర్పంచ్​ కర్ర సత్యప్రసన్నరెడ్డి, పాలకవర్గ సభ్యులు గ్రామపంచాయతీ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్​ మాట్లాడుతూ.. గ్రామంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారని, ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి గ్రామసభ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఆఫీసర్లను డిమాండ్​ చేశారు.  గ్రామంలో గుంటకు రూ.15లక్షల విలువ ఉందని, ఇంత ఖరీదైన భూమిని గ్రామసభ పెట్టకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం కరెక్ట్​ కాదన్నారు. ఈ విషయంపై తహసీల్దార్​ను ఫోన్​ ద్వారా వివరణ కోరితే పాలకవర్గానికి చెప్పాలని ఏమీ లేదని సమాధానం ఇచ్చారన్నారు. స్థల కేటాయింపు, స్థలాలు ఎవరెవరికి ఇస్తున్నారో వారి లిస్టు కూడా ఇవ్వడం లేదని సర్పంచ్​ వాపోయారు. కలెక్టర్​ విచారణ జరిపించి గ్రామసభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్​ చేశారు.