మహబూబ్‌నగర్, వెలుగు : ఉపాధి హామీ పథకం డబ్బులను ఇవ్వాలని అడిగిన ఓ దివ్యాంగుడిని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ బూతులు తిట్టాడు. ‘నన్నే ఎదిరించి మాట్లాడతావా రా’ అంటూ కాలితో తన్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌జిల్లా హన్వాడ మండలం పుల్సోనిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కృష్ణయ్య ఉపాధి హామీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడు వారాలకు సంబంధించిన కూలి డబ్బులు రావాల్సి ఉండగా శుక్రవారం సర్పంచ్ కోస్గి శ్రీనివాసులును అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది.
ఈ క్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు దివ్యాంగుడైన కృష్ణయ్యను నానా బూతులు తిట్టాడు. అక్కడే ఉన్న దివ్యాంగుడి కుటుంబసభ్యులను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ కాలితో తన్నాడు. మండలానికి చెందిన ఆఫీసర్లను నోటి కొచ్చినట్లు తిట్టాడు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను సెల్ఫోన్లో వీడియో తీసి వైరల్చేశారు. ఘటనపై బాధితుడు హన్వాడ పోలీసులకు కంప్లయింట్చేయడంతో కేసు నమోదు చేశారు. దాడి చేసిన సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్పందించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న కలెక్టర్ ఎస్ వెంకట్రావు సర్పంచ్ శ్రీనివాసులును సస్పెండ్ చేశారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, వికలాంగుడని కూడా చూడకుండా క్రూరంగా ప్రవర్తించడంతో అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాల్సిందిగా ఆర్డీఈఓ అనిల్ కుమార్ ను ఆయన ఆదేశించారు.