ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆసరా పింఛన్లు రానివారికి నగదు అందించిన పుల్లారెడ్డి

కోదాడ,వెలుగు: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతి నగర్ గ్రామంలో పింఛన్లు రాని అర్హులకు అంతే నగదు అందించి దాతృత్వం చాటుకున్నారు మాజీ సర్పంచ్​బద్దం పుల్లారెడ్డి. వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల ప్రభుత్వం ఆసరా పింఛన్లు మంజూరు చేయగా అర్హులైన కొందరికి రాలేదు. దీంతో వారి దుస్థితికి చలించిన మాజీ సర్పంచ్​ మంగళవారం అర్హులైన ఏడుగురికి రూ.2016 చొప్పున అందజేశారు. పింఛన్​ మంజూరయ్యే వరకు ప్రతినెలా నగదు ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సింగారెడ్డి, లీడర్లు భద్రారెడ్డి,వెంకటరెడ్డి, ఎస్ కే లాల్,  బద్రిగోపాలరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

సెంట్రల్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలి

హుజూర్ నగర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల వీరబాబు డిమాండ్​చేశారు. మంగళవారం హుజూర్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆల్ఇండియా కమిటీ పిలుపులో భాగంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నవంబర్3న చేపట్టనున్న చలో ఢిల్లీ, పార్లమెంట్​ముట్టడిని సక్సెస్ ​చేయాలని పిలుపునిచ్చారు. 

జోడో యాత్రకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

యాదగిరిగుట్ట నుంచి 700 వాహనాలతో ర్యాలీ

యాదగిరిగుట్ట, వెలుగు: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా యాత్రలో పాల్గొనడానికి మంగళవారం ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​శ్రేణులు తరలివెళ్లాయి. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి 700 వాహనాల్లో కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్​కు చేరుకున్నారు. తొలుత యాదగిరిగుట్టకు చేరుకున్న వాహనాలకు పీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్​చార్జి బీర్ల అయిలయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం వద్ద ఉన్న నరసింహుడి పాదాలకు ప్రత్యేక పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. కాంగ్రెస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు భరత్ గౌడ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ యాకూబ్, తుర్కపల్లి, రాజాపేట, బొమ్మలరామారం మండలాల అధ్యక్షులు శంకర్ నాయక్, మహేందర్ గౌడ్, మల్లేశం పాల్గొన్నారు.

ఐదో రోజుకు ‘బస్వాపూర్’ నిర్వాసితుల దీక్ష

యాదగిరిగుట్ట, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా వాసులు చేపట్టిన దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన ఆర్డర్లు జారీ చేసి ఏడాది అవుతున్నా ఆఫీసర్లు అమలు చేయడంలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపై లప్పనాయక్ తండా గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లప్పనాయక్ తండా సర్పంచ్ ధీరావత్ బుజ్జి, నిర్వాసితులు మాట్లాడుతూ పునరావాస ప్యాకేజీ కింద ఇండ్లు కోల్పోయిన గ్రామస్తులకు ఒక్కో ఫ్యామిలీకి రూ.7.61 లక్షలు, దాతరుపల్లి రెవెన్యూ పరిధిలో 200 గజాల చొప్పున ఇండ్ల స్థలం ఇస్తామన్న ప్రభుత్వ హామీలు పేపర్లకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంక్యా నాయక్, మాజీ సర్పంచ్ గాశీరాం, నిర్వాసితులు పాల్గొన్నారు.

రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలని జీవిత ప్రచారం

చౌటుప్పల్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలని సినీ నటి జీవిత కోరారు. మంగళవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం కొయ్యలగూడెంలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ పథకాలను కేసీఆర్​ ప్రభుత్వం తనవిగా చెప్పుకుంటోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్​ను ఓడించాలని కోరారు. ప్రచారంలో బీజేపీ లీడర్లు చందా మహేందర్​గుప్తా, జనగామ నర్సింహాచారి ఉన్నారు.

మునుగోడులో బీజేపీదే గెలుపు

చౌటుప్పల్ వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం చౌటుప్పల్ లోని లింగోజి గూడెంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోరుతూ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేషనల్ ​హైవే మీదుగా లింగోజిగూడెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతనే మునుగోడులో అభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో దాసోజు భిక్షమాచారి, కడారి అయిలయ్య,  బండారు మహేందర్ రెడ్డి, పిల్ల బుచ్చయ్య, ఉదరి రంగయ్య, తరుణ్, గణేశ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. 

 రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొనాలి

 నార్కట్ పల్లి వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్లు కొనాలని డీఆర్డీవో కాలిందిని అధికారులకు సూచించారు. మంగళవారం నార్కట్ పల్లి లో ఈజీఎస్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని బ్రాహ్మణ వెల్లంల నర్సరీ సైట్ ను పరిశీలించి, ఉపాధి హామీ వర్క్ సైన్​బోర్డును త్వరగా పూర్తి చేయాలన్నారు. చౌడంపల్లి, బ్రాహ్మణ వెల్లంల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి గౌడ్, ఏపీవో యాదయ్య, ఏపీఎం శ్రీనివాస్, ఈసీ రాంబాబు, టీఏలు పాల్గొన్నారు.

ట్రాన్స్ పోర్టు టెండర్​ రద్దు చేయాలి

సూర్యాపేట, వెలుగు: జిల్లాలోని జాజిరెడ్డిగూడెం క్లస్టర్​కు నిర్వహించిన వడ్ల ట్రాన్స్ పోర్టు టెండర్​ను రద్దు చేయాలని టెండర్​లో పాల్గొన్న గంగనబోయిన వెంకన్న కోరారు. మంగళవారం  కలెక్టరేట్​ ముందు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు సెంటర్లలో వడ్ల ట్రాన్స్​పోర్ట్​కు టెండర్ ఆహ్వానించగా జాజిరెడ్డిగూడెం క్లస్టర్​కు తనతోపాటు పాటు మరొకటి వేశారన్నారు. అయితే  2022 మోడల్​వాహనాలకు ఫిట్​నెస్​సర్టిఫికేట్​లేదని టెండర్​రిజక్ట్​చేశారని, జిల్లాలో నాలుగు క్లస్టర్లలో రిజెక్ట్​అయిన వ్యక్తికి టెండర్​ఎలా కేటాయిస్తారని వెంకన్న ఆరోపించారు.

స్టూడెంట్స్​ సామర్థ్యం పెరిగేలా బోధించాలి

యాదాద్రి, వెలుగు: విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుపడేలా బోధన ఉండాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.  మంగళవారం బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి, బట్టుగూడెం ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్​సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వారితో పాఠ్యాంశాలు చదివించారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. స్కూల్స్​లో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. అనంతరం టీచర్స్​తో మాట్లాడుతూ విద్యార్థులు అక్షర దోషాలు లేకుండా రాసేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.