ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా మారారు సర్పంచ్ శ్రీను. కొద్ది రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉండడంతో గ్రామంలోని వీధులన్నీ చెత్తతో పేరుకుపోయాయి. ప్రజలు అవస్థలు పడుతుండడంతో గ్రామ సర్పంచ్ శ్రీను.. పారిశుధ్య కార్మికుడిగా మారి ట్రాక్టర్ నడుపుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి చెత్తను సేకరించారు.
పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని సర్పంచ్ శ్రీను వ్యాఖ్యానించారు. పంచాయతీ కార్మికుల పొట్టకొట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగదన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలే ధర్నాలు, రాస్తారోకోలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. గత 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ అకౌంట్లలో చిల్లీగవ్వ కూడా వేయకుండా తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.