పదవీ కాలం దగ్గర పడుతున్నా క్లియర్ కాని బిల్లులు

పదవీ కాలం దగ్గర పడుతున్నా క్లియర్ కాని బిల్లులు
  • గ్రామ పంచాయతీల్లో పనులు చేయించి తిప్పలు పడుతున్న సర్పంచులు

వనపర్తి, వెలుగు : చేసిన పనులకు బిల్లులు రాక తిప్పలు పడుతున్న సర్పంచులు తమ పదవీ కాలం ముగుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. స్టేట్, సెంట్రల్  ఫైనాన్స్ తో పాటు జనరల్ ఫండ్ తో చేసిన పలు అభివృద్ధి పనులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేండ్లుగా సర్పంచులకు సరైన సమయంలో బిల్లులు చెల్లించకుండా బీఆర్ఎస్  ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. జీపీ ఖాతాలను ఫ్రీజ్  చేస్తూ నిధులను డ్రా చేయకుండా అడ్డు పడడంతో చాలా మంది సర్పంచులు ప్రభుత్వంపై తిరగబడ్డారు. మరి కొందరు ఆర్థికంగా దెబ్బతిని అప్పుల పాలయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో 441, వనపర్తి జిల్లాలో 255, జోగులాంబ గద్వాలలో-255, నారాయణపేట-లో 280, నాగర్ కర్నూల్-లో 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

వీటి ఖాతాల్లో ఇప్పటికీ కోట్లాది నిధులు ఉన్నా చెక్కులు పాస్  కావడం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ  ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల వివరాలు కోరింది. దీంతో మరో నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ఇస్తోంది. వాస్తవానికి 2024 జనవరి 26తో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది.

రూ.10 కోట్లకు పైగా..

వనపర్తి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఆధ్వర్యంలో స్టేట్, సెంట్రల్  ఫైనాన్స్  నిధులతో పాటు జనరల్  ఫండ్​నిధులు, సీఎం నిధులతో పనులు చేపట్టారు. దీనికి తోడు మన ఊరు–మన బడి కింద స్కూల్ బిల్డింగ్  పనులు చేశారు. వనపర్తిలో కలెక్టరేట్ ఓపెనింగ్​ సమయంలో ప్రతి జీపీకి రూ.20 లక్షలు చొప్పున సీఎం ఫండ్స్​ మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, డ్రైన్ల పనులను చేశారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.5 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. మన ఊరు–మన బడి కింద చేపట్టిన స్కూల్ బిల్డింగ్ లకు సంబంధించి మరో రూ.10 కోట్లు పెండింగ్​లో ఉండడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రూ.60 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుల ద్వారా తెలిసింది.

రిజర్వేషన్లపై ఆందోళన..

పదేండ్ల వరకు ఇవే రిజర్వేషన్లు ఉంటాయని గతంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం ప్రకటించగా, ఈ సారి రిజర్వేషన్లు మారుస్తామని కొత్త ప్రభుత్వం చెబుతోంది. ఉమ్మడి జిల్లాలో 2019లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీలకు 66, ఎస్సీలకు 295, బీసీలకు 355, జనరల్​కు 716 జీపీలను కేటాయించారు. వీటిలో సగం స్థానాలను మహిళలకు రిజర్వ్​ చేశారు. రిజర్వేషన్లు మార్చకపోవడంతో తాము అవకాశం కోల్పోయామని చాలా మంది ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లపై ఇప్పటికే కలెక్టర్లకు పలు గ్రామాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి.

రూ.10 లక్షల బిల్లు రావాలి..

15 రోజుల్లో సర్పంచ్  ఎన్నికలకు నోటిఫికేషన్  వస్తుందని అంటున్నారు. విలేజ్​లో రూ. 10 లక్షలతో సీసీ రోడ్లు వేయించినా. అధికారులు చెక్  పాస్  చేయడం లేదు. ట్రెజరీలో ఫండ్స్​ లేవని చెబుతున్నారు. తమ బిల్లులు పూర్తి గా చెల్లించాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది.

– రాంచందర్ నాయక్, సర్పంచ్, కర్నె, మదనాపురం మండలం