కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ..సర్పంచ్ ల ఉసురు తీస్తున్నరు

కేంద్ర నిధులను దారి మళ్ళిస్తూ  రాష్ట్ర సర్కారు సర్పంచ్ ల ఉసురు తీస్తున్నది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం  క్షణాల్లో మాయం చేసింది. నిధులు లేక గ్రామపంచాయతీలు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే దొంగతనంగా నిధులను దారి మళ్ళించడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం. స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల‌కు తెలియ‌కుండా, పంచాయ‌తీ బోర్డు తీర్మానం లేకుండా.. ఆయా పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం దారుణం. ప్రజలను మభ్యపెడుతూ చివరకు సర్పంచ్ ల డిజిటల్ కీ లను దొంగతనంగా వాడుతూ నిధులు మళ్లిస్తున్న కేసీఆర్ అధర్మ పాలనలో గ్రామాలు ఛిద్రమవుతున్నాయి. మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి స‌ర్పంచ్ కూడా అంతే. అటువంటి స‌ర్పంచుల్ని ఆట‌బొమ్మల్ని చేసి, పంచాయ‌తీల నిధులను దారిదోపిడీ దొంగ‌లా ప్రభుత్వమే మాయం చేయడం ఒక  దారుణం. గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి. పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధులను దారి మళ్లించడం రాజ్యాంగ‌విరుద్ధం. అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటల్లా తాకట్టు పెట్టడం. ఈ మూడు మార్గాలు అయిపోయాయి. ఇప్పుడు  పంచాయతీ నిధుల మళ్లింపు మీద‌పడ్డారు.

ఆగిన అభివృద్ధి నిధులు

రాష్ట్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఇజీఎస్ కింద రైతు కల్లాలను రైతుకు సంబంధించిన సొంత సర్వే నంబర్ల లో ఏర్పాటు చేయమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ భూములలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే చోట పది పదిహేను కల్లాలు నిర్మించడం ఎంజిఎన్ఆర్ఇజిఎస్  నిబంధనలకు విరుద్ధం. నిబంధనలకు విరుద్ధంగా వాడిన నిధులు 152 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటివరకు చెల్లించలేదు.  దీని వలన గ్రామాలలో సర్పంచ్ లు  చేసిన ఎంజీఎన్ఆర్ఇజీఎస్ కింద వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, చెత్త సేకరణ షెడ్లు,  సిసి రోడ్ల కు దాదాపు 1100 కోట్లు కేంద్ర ప్రభుత్వ  నిధులు ఆగిపోయాయి. ఒకరకంగా సర్పంచులను ఇబ్బంది పెట్టాలనే  కేసీఆర్ ప్రభుత్వం ఆ 152 కోట్లు చెల్లించకుండా సర్పంచులను అప్పుల పాలు చేస్తున్నదని చెప్పాలి. 

దొంగచాటుగా మళ్లింపులు

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు కొన్ని గ్రామాలలో కాంట్రాక్టర్లు వదిలిపెట్టి పోయారు.   అధికారులు తమ టార్గెట్ పూర్తి కావడానికి     కొంతమంది సర్పంచుల చేత, కొంతమంది జడ్పిటిసిలు, స్థానిక నాయకుల చేత  వదిలిపెట్టిపోయిన కాంట్రాక్టర్ల పేరుతోనే పనులు చేయించారు. ఇట్టి పనులు పూర్తయి టోకెన్ నెంబర్లు పడినా గత రెండు సంవత్సరాలుగా బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనల ద్వారా సర్పంచులు ఆర్థికంగా తమ స్తోమతకు మించి అప్పులు చేశారు. ఇప్పటివరకు బకాయిలు చెల్లించిన దాఖలాలు మాత్రం లేవు. గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం అప్పటి పనులకు రికార్డులు అయి ఉండి కేంద్ర ప్రభుత్వం నిధులు వేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడపా దడపా వేయడంతో ఆ నిధులు కరెంటు బిల్లులు,, సిబ్బంది జీతాలు ట్రాక్టర్ ఈ ఏమ్ ఐ చెల్లించినారు. కేంద్ర ప్రభుత్వం నిధులు పడగానే ఆ చెక్కులతోనే మళ్ళీ 15వ ఆర్థిక సంఘం నిధుల డిజిటల్ కీలను అధికారుల దగ్గర పెట్టుకుని దొంగతనంగా వాడుకున్నారు. దీన్ని సర్పంచులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

అవార్డులు సర్కారుకు, ఆత్మహత్యలు సర్పంచులకు

2019లో గెలిచిన సర్పంచులు చెక్ పవర్ లేకుండా ఆరు నెలల కాలాన్ని గడిపేశారు. తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం పనుల కోసం అంటువ్యాధులు ప్రబల కుండా గ్రామాలను రక్షించడంలో కీలకపాత్ర పోషించారు.  ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి  గ్రామాల్లో వైకుంఠ దామాలు,  కంపోస్ట్ షెడ్ లు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకొని గ్రామాలు గ్రీనరీగా, శుభ్రంగా ఉండేలా చేస్తే,  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అత్యధికంగా అవార్డులు ఇచ్చింది. కేవలం అది సర్పంచుల కృషి ఫలితమే తప్ప అది కేసీఆర్​ సర్కార్​ గొప్పతనమేమీకాదు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది. అనేక మంది సర్పంచుల ఆత్మహత్యలూ చూశాం.  అవార్డులు ప్రభుత్వానికి, ఆత్మహత్యలు సర్పంచులకు అన్నట్లుగా కేసీఆర్​ ప్రభుత్వ ధోరణి సాగుతోంది.  కొంతమంది సర్పంచులు తమ బిల్లులు చెల్లిస్తారా లేదా మా చావుకు అనుమతిస్తారా అని హైకోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 

గ్రామ పాలకుడి ​ గతి ఏమవుతున్నది?

కొన్ని చోట్ల సర్పంచులు బిక్షాటన చేస్తున్నారు, కొన్నిచోట్ల కూలీ పనులు చేస్తున్నారు, మరికొన్నిచోట్ల వ్యవసాయ పనులకు వెళ్తున్నారు, కొంతమంది నైట్ వాచ్​మెన్ గా చేస్తున్నారు. ఎన్నో ఆశలతో గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడిన వీరికి ఈ పరిస్థితి దాపురించడం మన పంచాయతీ వ్యవస్థకే అపకీర్తిగా మారుతున్నది.    గ్రామ పరిధిలో సర్పంచ్​  పదవి సీఎం, పీఎంతో సమానమైనది. ఆ పదవికి ఉన్న గౌరవం ఏమవుతున్నది?   సర్పంచుల సమస్యలపై స్పందన కరువైతే, రాష్ట్రంలో  పంచాయతీ వ్యవస్థ నిర్జీవమైనట్లే.   

‘సర్పంచ్’​ వెట్టిచాకిరీ పదవిగా మారుతోందా?

గ్రామాలకు సంబంధించిన ప్రధాన ఆర్థిక వనరైన మిషన్ భగీరథ పేరుతో నల్లా పన్ను రద్దు చేశారు. బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన అమౌంట్ ఇవ్వడం లేదు, క్వారీలకు  సీనరీ చెల్లించడం లేదు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సర్పంచులు కనీసం ప్రజలకు సేవ చేద్దామంటే పెన్షన్లలో, ఇండ్ల మంజూరీలో ప్రభుత్వపరమైన పథకాల్లో  సర్పంచుల పాత్రను పూర్తిగా తొలగించేశారు. గ్రామానికి పాలకుడుగా ఉండాల్సిన సర్పంచ్ ను​ ఇవాళ నిమిత్తమాత్రుడిగా మార్చేసింది ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్ 29 అధికారాలను సర్పంచులకు బదలాయిస్తున్నామని గొప్పగా చెప్పారు.  ఇవాళ ఎన్నికైన అదే సర్పంచ్​ల బతుకులను ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో ఆలోచించాలి. ఇప్పటికైనా  కేంద్ర నిధుల మళ్లింపును మానుకోవాలి. గ్రామ పంచాయతీలను బతకనివ్వాలి. సర్పంచ్ లను  వెట్టిచాకిరి మనుషులుగా మార్చేస్తున్న  రాష్ట్ర సర్కారు తీరు మాత్రం మంచి పరిణామం  కాబోదు.
- బింగి కరుణాకర్‌,
సర్పంచ్‌, రంగాపూర్‌,
హుజురాబాద్‌ మండలం