పార్టీలకతీతంగా రాజీనామాలకు సర్పంచులు రెడీ

  • పెండింగ్​ బిల్లుల కోసం సర్పంచుల పోరుబాట
  • ‘పల్లె ప్రగతి’ని బాయ్​కాట్​ చేస్తమని హెచ్చరిక
  • నాలుగు విడతల పల్లె ప్రగతి పనులతో అప్పులపాలు
  • ఫండ్స్​ ఇచ్చినట్లు జీవోలిచ్చి.. అకౌంట్స్​ను ఫ్రీజ్​ చేస్తున్న సర్కార్​
  • పైగా సస్పెన్షన్లు, చెక్​ పవర్​ రద్దు చేస్తామంటూ బెదిరింపులు
  • పార్టీలకతీతంగా రాజీనామాలకు సర్పంచులు రెడీ.. ఇందులో ఎక్కువ మంది టీఆర్​ఎస్​ వాళ్లే

హైదరాబాద్/మంచిర్యాల/యాదాద్రి, వెలుగు: ఊర్లలో రాష్ట్ర సర్కార్ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోయిన సర్పంచులకు అప్పులే మిగిలాయి. ఏడాదిగా ట్రెజరీల్లో చెక్కులు పాస్​ కాకపోవడంతో బిల్లులు పేరుకుపోయాయి. ఫలితంగా అప్పులు పెరగడం, వడ్డీలు మీదపడుతుండడంతో సర్పంచులు పార్టీలకతీతంగా ఆందోళనబాట పట్టారు. ఇందులో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీవాళ్లే ఉన్నారు. ఇప్పటికే నాలుగు విడతల పల్లె ప్రగతి పనుల బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నాయని, అవన్నీ క్లియర్​ చేస్తే తప్ప జూన్ 3 నుంచి జరుగనున్న ఐదో విడత పల్లెప్రగతిలో పాల్గొనబోమని తేల్చిచెప్తున్నారు.
‘‘అప్పుల పాలయ్యాం.. బిల్లులు చెల్లించండి’’ అని సర్పంచులు కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారు లేకుండానే పల్లెప్రగతి సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఇది సర్పంచులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. జిల్లాస్థాయి మీటింగులకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలను ఆహ్వానించి తమను పిలవకపోవడంపై వారు మండిపడుతున్నారు. జూన్​ 3లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే పల్లెప్రగతిని బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. 
చెప్పిన పనులన్నీ తాము చేసుకుంటూ పోతే బిల్లులు చెల్లించకపోగా, సస్పెండ్​ చేస్తామని బెదిరించడం, చెక్​ పవర్​ రద్దు చేస్తామనడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.  సర్పంచుల సహాయ నిరాకరణతో ఐదో విడత పల్లెప్రగతి ఎలాగన్న ప్రశ్న ఎదురవుతున్నది. గ్రామాల్లో ఏ పనులు చేయాలన్నా సర్పంచులే ముందుండి నడిపించాల్సి ఉంటుంది. ఒకవేళ సర్పంచులు పాల్గొనకుంటే పంచాయతీ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. 
లక్షల్లో బిల్లులు పెండింగ్
హరితహారంలో మొక్కలు బతకకున్నా, పారిశుధ్యం లోపించినా సర్పంచులను, సెక్రటరీలను బాధ్యులను చేస్తూ అధికారులు సస్పెన్షన్​ వేటు వేస్తున్నారు. 
దీంతో అప్పులు చేసైనా పనులు చేయించక తప్పడం లేదు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, రైతువేదికలు తదితర అభివృద్ధి పనులను సర్పంచులు చేపట్టారు. వీటికి సంబంధించిన బిల్లులు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్​ లో ఉన్నాయి. ప్రభుత్వం ఫండ్స్ ఇస్తున్నట్లు జీవోలు ఇస్తూ.. పంచాయతీ అకౌంట్లలో పైసలు ఫ్రీజ్​ చేస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సమర్పించిన బిల్లులను మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో క్యాన్సిల్ చేశారు. మళ్లీ ఏప్రిల్​లో  కొత్తగా బిల్లులు పెట్టి రెండు నెలలు గడిచినా ఇంత వరకు నిధుల జాడ లేదు. మెజారిటీ సర్పంచులకు రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి.
సర్పంచులు రెండు నుంచి ఐదు పర్సంటేజీ మిత్తికి తెచ్చి పనులు చేశారు. ఏడాది కాలంగా బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి తమ విధులను పెంచి, అధికారాలను కత్తిరించిందని సర్పంచులు మండిపడుతున్నారు. ఆఫీసర్ల కింద పనిచేసే ఉద్యోగుల్లా పనిచేశామని, అయినా పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తమ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఏనాడూ చూడలేదని, పల్లెప్రగతిలో పాల్గొనేది లేదని సీనియర్ సర్పంచులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
భారంగా నిర్వహణ ఖర్చులు
గ్రామ పంచాయతీల్లో వసూలయ్యే పన్నులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వీటితోనే సిబ్బంది వేతనాలు, జీపీ మెయింటెనెన్స్‌‌‌‌ ఖర్చులను సర్పంచులు భరించాల్సి వస్తున్నది. గ్రామాల్లో చెత్త సేకరణకు, ఇతర పనులకు తీసుకున్న ట్రాక్టర్ల నెలవారీ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ మెంట్‌‌‌‌ మినిమమ్‌‌‌‌ రూ.11 వేలు ఉండగా,  డ్రైవర్‌‌‌‌‌‌‌‌ జీతం రూ. 8,500 ఉంది. గ్రామ పంచాయతీ ఏదైనా కార్మికుల వేతనం రూ. 8,500గా నిర్ణయించారు. ఇక ట్రాక్టర్​కు రోడ్‌‌‌‌ ట్యాక్సులు నెలకు రూ. 1,500 వరకు చెల్లించాల్సి వస్తున్నది. వీటికి డీజిల్‌‌‌‌ ఖర్చులు, మైనర్‌‌‌‌‌‌‌‌ రిపేర్లు తోడవుతున్నాయి. కొన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ట్రాలీకి, ట్యాంకర్‌‌‌‌‌‌‌‌కు కూడా లోన్‌‌‌‌ తీసుకున్నారు. వీటికి  నెలకు రూ.16 వేల వరకు ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్లు చెల్లించాల్సి వస్తున్నది. కొన్ని పెద్ద పంచాయతీలకు ఇబ్బందులు లేకున్నప్పటికీ.. చిన్న పంచాయతీలకు ఏం చేయాలన్నా కష్టంగా మారుతున్నది. 
చెప్పిన దాంట్లో ఇచ్చేది సగం లోపే ! 


పల్లె, పట్టణ ప్రగతికి ప్రతి నెలా కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా కొంత రాష్ట్ర వాటా కలిపి ప్రభుత్వం ఫండ్స్​ రిలీజ్​ చేస్తున్నది. ప్రారంభంలో పల్లె, పట్టణ ప్రగతికి కలిపి నెలకు రూ. 478 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో పల్లె ప్రగతికి రూ. 308 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.148 కోట్లుగా ఉంది. కొన్ని నెలలు టంచన్ గా రిలీజ్​ చేసి.. ఆ తర్వాత నిధుల్లో కోత పెట్టడం మొదలుపెట్టారు. కరోనా రావడంతో ఇంకిన్ని నిధులు అధికారికంగానే తగ్గించారు. పల్లె ప్రగతికి రూ. 227 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.112 కోట్లు (ఇందులో జీహెచ్​ఎంసీకి రూ.59 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.53 కోట్లు) ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు తీరా ఇస్తున్న నిధులు చూస్తే తొలుత ప్రకటించిన దాంట్లో సగం కంటే తక్కువగానే ఉంటున్నాయి. దీంట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులే 70 శాతం దాకా ఉంటున్నాయని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు అసలే ఫండ్స్​కు కటకట ఉండటంతో పల్లె, పట్టణ ప్రగతికి మరిన్ని నిధులు కోత పెడుతున్నట్లు తెలిసింది. 
సర్పంచుల సహాయ నిరాకరణ 
యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లో శనివారం ఏర్పాటు చేసిన ఐదో విడత పల్లెప్రగతి సమావేశాన్ని సర్పంచులు బహిష్కరించారు. పాత బిల్లులు చెల్లించిన తర్వాతే కార్యక్రమం నిర్వహిస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల సర్పంచులు తేల్చిచెప్పారు. టీఆర్​ఎస్​కు చెందిన ఓ​ సర్పంచ్​ ఏకంగా మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుపై మండిపడ్డారు. తమ గ్రామాలకు రావాల్సిన ఫండ్స్​ను మళ్లించుకున్నారని ఆరోపించారు. మునుగోడులో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నందుకే నిధులు ఆపుతున్నారని టీఆర్ఎస్ సర్పంచులు మండిపడుతున్నారు.

వనపర్తి జిల్లాలో పల్లెప్రగతి సమావేశానికి అధికార పార్టీకి చెందిన మెజారిటీ సర్పంచులు వెళ్లలేదు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సదస్సుకు సర్పంచులను అధికారులు పిలువలేదు. వచ్చే నెల 3లోగా బిల్లులు చెల్లించకపోతే పల్లెప్రగతిని బహిష్కరిస్తామని సర్పంచులు ప్రకటించారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోతే పల్లెప్రగతిలో పాల్గొనబోమని జగిత్యాల రూరల్ మండలంలోని సర్పంచులు ఈ నెల 18న తీర్మానం చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సర్పంచులు బిల్లుల కోసం అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శనివారం ఏర్పాటు చేసిన పల్లెప్రగతి మీటింగ్​ ను సర్పంచులు బహిష్కరించారు. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో పెండింగ్ బిల్లుల గురించి సర్పంచులు  ప్రశ్నించారు.
మీరు సస్పెండ్​ చేసుడేంది.. మేమే రాజీనామా చేస్తం


‘‘మీరు సస్పెండ్ చేసేది ఏంది, మేమే రాజీనామా చేస్తం. మీ పాలనలో సర్పంచ్​ గా ఉన్నందుకు సర్పంచులు అందరూ సిగ్గుపడుతున్నారు. మీ పాలనలో సర్పంచ్ కన్నా సఫాయి పని నయం. మతి ఉండే మాట్లాడుతున్నారా?’’ అంటూ ఓ మంత్రి తీరుపై మండిపడుతూ వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కరుణాకర్ ఇటీవల ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్​ చేశారు.  
మంత్రులు ఫండ్స్​ మళ్లించుకున్నరు

తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయనుకున్నం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నరనే.. మునుగోడుకు హెచ్​ఎండీఏ, ఉపాధి నిధులతో పాటు ఎలాంటి ఫండ్స్​ను మంజూరు చేయడం లేదు. టీఆర్​ఎస్​ సర్పంచులుగా ఉన్న మేం.. ఏం కావాలి. నిధులు ఇవ్వకపోగా.. స్థానిక కంపెనీల నుంచి సీఎస్సార్​ గ్రాంట్​ రూపంలో వచ్చే ఫండ్స్​ను కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలకు మళ్లించుకున్నరు.  పొల్యూషన్​ మాకు.. ఫండ్స్​ మాత్రం మంత్రులకా?  - శ్రీనివాసరెడ్డి, అల్లపురం ​సర్పంచ్​ (టీఆర్​ఎస్​), యాదాద్రి జిల్లా
సర్పంచులు లేకుండానే పల్లె ప్రగతి సమావేశాలు


పల్లెప్రగతిపై జనగామ కలెక్టరేట్​లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి సర్పంచులకు ఆహ్వానం అందలేదు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు గెస్ట్ హౌస్​లో నిర్వహించిన సమావేశానికి కూడా సర్పంచులను పిలవలేదు. ములుగు జిల్లాల్లోనూ అదే పరిస్థితి. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే నాలుగు మండలాల్లో సమావేశాలు పెడితే.. పెండింగ్ బిల్లులు చెల్లించి, పల్లె ప్రగతికి నిధులు ఇస్తేనే కొత్త పనులు చేస్తామని సర్పంచులు ప్రకటించారు. 
పల్లెప్రగతిని బహిష్కరిస్తం 
పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తున్నది. ఏండ్లుగా బిల్లులు రాకపోవడంతో సర్పంచులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జూన్ 3లోగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పల్లెప్రగతి ప్రోగ్రాంలో పాల్గొంటాం. లేదంటే బహిష్కరిస్తాం. ఇప్పటికే అప్పులపాలయ్యాం. ఇంకా అప్పులు తెచ్చి పనులు చేయలేం. అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పిస్తాం. - శంకర్, అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా సర్పంచుల సంఘం 
మాతో పెట్టుకుంటే సర్కార్ ను కూల్చేస్తం
యాదాద్రి జిల్లాలోని ప్రతి పంచాయతీకి 25 లక్షల చొప్పున ఇస్తానని కేసీఆర్​ చెప్పారు. మునుగోడులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడని పట్టించుకోవడం లేదు. మాకు ఇవ్వాల్సిన ఫండ్స్​ ఇవ్వడంతో పాటు బ్యాంకుల్లో ఫ్రీజింగ్​ ఎత్తివేయాలి. అట్లయితేనే పల్లె ప్రగతిలో పాల్గొంటాం. 2018 చట్టాన్ని అడ్డం పెట్టుకొని పల్లె ప్రగతి నిర్వహించకపోతే సర్పంచులను తొలగిస్తామని మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.  బెదిరిస్తే బెదరం. మాతో పెట్టుకుంటే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. - బాతరాజు సత్యం, పంతంగి సర్పంచ్​     (బీజేపీ), యాదాద్రి జిల్లా
అప్పులు తెచ్చి చేయాల్సిన ఖర్మేంటీ? 
పనులు చేయమంటరు.. చేస్తే పైసలు ఇయ్యరు. వైకుంఠధామం, డంపింగ్​యార్డు పనులు చేసి రూ. 5 లక్షలు నష్టపోయాను. గ్రామ సర్పంచ్ గా ఆ పనులు చేయాల్సిన ఖర్మ నాకేంటీ.. నేనేమైనా కాంట్రాక్టర్ నా? అప్పులు చేసి పనులు చెయ్యుమంటే మాతోటి కాదు.  - రాంపాక నాగయ్య, పనకబండ సర్పంచ్​ (టీఆర్​ఎస్​), యాదాద్రి జిల్లా.

 

ఇవి కూడా చదవండి

దివ్యాంగుడ్ని విమానం ఎక్కించుకోని ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5లక్షల జరిమానా

సీమాకు రెండో కాలు వచ్చేసింది

ఫోన్‌ కాల్స్‌ వింటున్నరు.. యాడ్స్ గుప్పిస్తున్నరు