డిజిటల్ కీ దుర్వినియోగం

డిజిటల్ కీ దుర్వినియోగం

అడ్డాకుల, వెలుగు: సర్పంచులు, ఉప సర్పంచులకు సంబంధించిన డిజిటల్ కీని దుర్వినియోగం చేస్తున్నారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే అధికారులు నిధులను డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మహబూబ్​నగర్​  జిల్లా అడ్డాకుల మండలం  శాఖాపూర్  సర్పంచ్​గా జయన్న గౌడ్, కందూరు సర్పంచ్ గా శ్రీకాంత్, తిమ్మాయిపల్లి తండా సర్పంచ్గా కిషన్ ఎన్నికయ్యారు. 

రూల్   ప్రకారం వారితో పాటు ఉప సర్పంచులకూ జాయింట్ అకౌంట్ కింద డిజిటల్ సైన్ కీ అథంటికేషన్  ఇచ్చారు. కానీ, కీ మాత్రం ఎంపీడీఓ ఆఫీస్​లోనే ఉంచారు. ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆఫీసర్లు వారికి ఆ డిజిటల్  కీని అందజేయలేదు. ఇప్పుడు అదే సమస్యగా మారింది. తమ ప్రమేయం లేకుండానే అధికారులు బిల్లులు డ్రా చేస్తున్నారని సర్పంచులు, ఉప సర్పంచులు  ఆందోళనకు దిగారు.

 బుధవారం అడ్డాకుల ఎంపీడీఓ ఆఫీసులో కీ విషయంపై వాగ్వాదానికి దిగారు. డిజిటల్  కీ ని మండల కార్యాలయంలో ఉంచి తమకు తెలియకుండా అధికారులు, సెక్రటరీలు వారి ఇష్టానుసారం దుర్వినియోగం చేసుకుంటూ గ్రాంట్లను విత్ డ్రా చేసుకుంటున్నారని విమర్శించారు. కానీ ఏ గ్రాంట్ నుంచి నిధులు డ్రా చేస్తున్నారు, ఏ గ్రాంట్ నుంచి ఎంత డ్రా అవుతుంది అన్న వివరాలపై తమ సెల్ ఫోన్లకు మెసేజీలు రావడం లేదన్నారు. దీంతో జాయింట్ అకౌంట్లలో ఎంత అమౌంట్ విడ్ డ్రా చేస్తున్నారనే విషయాలు తెలియడం లేదన్నారు. 

విత్ డ్రా చేస్తున్న సెక్రటరీకి మాత్రమే ఈ విషయాలు తెలుసని, నిధుల గురించి తమకు లెక్కలు చూపాలని డిమాండ్  చేశారు. అలాగే మండలంలోని ఏ కార్యదర్శి కూడా నోట్ ఫైల్  లేకుండానే చెక్కులను విత్ డ్రా చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనికితోడు ఈ విషయాలపై పలుమార్లు మండల సభల్లో తాము ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా  స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని సర్పంచులు స్పష్టం చేశారు. అయితే, అడ్డాకుల కార్యదర్శి మహేశ్వరి ఇప్పటి వరకు డిజిటల్ కీ తమ దగ్గర ఉంచుకున్నందుకు సర్పంచులు తమను క్షమించాలని కోరడం కోస మెరుపు.

ఈమెయిల్ కు వచ్చే ఓటీపీతో విత్ డ్రా

సర్పంచులు,  ఉప సర్పంచులు అందుబాటులో లేకున్నా, ఫోన్లు స్విచ్చాఫ్​ లో   ఉన్నా ఓటీపీ తెలుసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. సంబంధిత గ్రామ పంచాయతీ ఈమెయిల్ కు జాయింట్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. ఈ ఈ మెయిల్ కు సంబంధించిన పాస్ వర్డ్  సెక్రటరీల వద్ద ఉంటుంది. దీని ఆధారంగా సర్పంచులు, ఉప సర్పంచులు తమ ఫోన్లకు వచ్చే ఓటీపీలు చెప్పకున్నా, ఈ మెయిల్ కు వచ్చే ఓటీపీ ద్వారా నిధులు డ్రా చేసుకునే అవకాశాలుంటాయని కొందరు ఆఫీసర్లు చెబుతున్నారు.