గ్రామాల్లో ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు
ప్రభుత్వ వ్యతిరేకతకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం
నేడో, రేపో సర్కారుకు నివేదిక
త్వరలోనే ప్రతి జిల్లా నుంచి 20 మంది సర్పంచులతో సీఎం సమావేశమయ్యే చాన్స్?
జయశంకర్ భూపాలపల్లి/నాగర్‌కర్నూల్/జగిత్యాల, వెలుగు: ‘రాష్ట్రంలోని సర్పంచ్‌లు ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మారారు? అసలు వాళ్లకేం కావాలి, ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.’ అనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రభుత్వం తీరుపై సర్పంచుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందంటూ వస్తున్న వార్తలపై సీఎం ఆఫీస్ ఫోకస్ పెట్టింది. ‘పవర్ లేని సర్పంచ్’ శీర్షికన ఈ నెల 4న ‘వీ6 వెలుగు’లో వచ్చిన కథనంతో అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రగతిభవన్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇంటెలిజెన్స్‌కు చెందిన సీఐ, ఎస్సై ర్యాంక్ కలిగిన ఆఫీసర్లు నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలువురు సర్పంచ్‌లతో నేరుగా మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లతోపాటు బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందినవారినీ పలకరిస్తున్నారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, విలేజ్ పార్కులు, రైతువేదికలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణానికి సర్పంచులకు టార్గెట్లు పెట్టడం, అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంపై సర్పంచులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంటెలిజెన్స్సర్వేలోనూ సర్పంచులు ఇవే విషయాలను చెబుతున్నట్లు సమాచారం. కొత్త పంచాయతీరాజ్చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కులను హరిస్తోందని కొందరు సర్పంచులు ఆరోపించినట్లు తెలిసింది. ముఖ్యంగా తమపై ఆఫీసర్ల పెత్తనం పెరిగిపోయిందని, సర్పంచ్‌లను ప్రజాప్రతినిధుల్లా కాకుండా సర్వెంట్లుగా చూస్తున్నారనే విషయాన్ని తాను చెప్పానని భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో సర్పంచ్‌గా గెలిచామని, కానీ ఇప్పుడు సర్పంచ్ ఎందుకు అయ్యామా..? అని బాధపడుతున్నామని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మరో సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలి ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్
ఇప్పటికే ప్రభుత్వ తీరుకు నిరసనగా స్టేట్‌వైడ్ వివిధ మండల సమావేశాల్లో సర్పంచులు గళం విప్పుతున్నారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలంటూ ఎక్కడికక్కడ బైఠాయిస్తున్నారు. నాడు వెంటపడి పనులు చేయించిన ఆఫీసర్లు, బిల్లుల కోసం వెళ్తే మొహం చాటేస్తుండడాన్ని తప్పుపడుతూ నిరసన తెలుపుతున్నారు. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్న ప్రభుత్వం, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సర్పంచుల్లో అసంతృప్తికి కారణాలేమిటో ఆరా తీస్తోంది. గడిచిన నాలుగైదు రోజులుగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు జరిపిన ఎంక్వైరీ రిపోర్ట్‌ను ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారని తెలిసింది. ఈ నివేదిక సారాంశాన్ని బట్టి సీఎం కేసీఆర్ త్వరలోనే సర్పంచ్‌లతో ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తారని.. దీనికి ప్రతి జిల్లా నుంచి 20 మంది వరకు ఎంపిక చేసిన సర్పంచ్‌లు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ సమావేశంలోనే పెండింగ్ బిల్లులన్నీ సీఎం క్లియర్చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. సర్పంచుల సమస్యలపై సర్వే చేస్తున్న మాట వాస్తవమే అంటున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, సీఎం మీటింగ్ విషయం తమకు తెలియదని చెబుతున్నారు. కాగా, సీఎంతో మీటింగ్ కోసం ఇంటర్నల్‌గా సర్పంచుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
11 నెలలుగా గౌరవ వేతనం లేదు
ఊళ్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పెద్దదిక్కుగా ఉండే సర్పంచ్‌కే చెప్పుకొంటారు. అలాంటి సర్పంచులనే ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. సర్కారు చెప్పిందని అప్పులు తెచ్చి రైతువేదికలు, శ్మశానవాటికలు, విలేజ్ పార్కులు, సెగ్రిగేషన్ షెడ్లు కట్టారు. నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదు. ఒక్కో సర్పంచ్10 లక్షల నుంచి 30 లక్షల వరకు అప్పులపాలై, పైసలిచ్చినోళ్లకు మొహం చూపించలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా సర్పంచులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున గౌరవవేతనం ఇవ్వాలి. కానీ 11 నెలలుగా ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నచిన్న పంచాయతీలు, తండాల్లోని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదీగాక 2019 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు సర్కారు నుంచి రూ.10 లక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.5 లక్షలు కలిపి రూ.15 లక్షలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. స్టేట్‌వైడ్ 2,134 గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఏకగ్రీవమై రెండేళ్లు గడుస్తున్నా సర్కారు నుంచి ఎలాంటి ప్రోత్సాహకం అందలేదు. ఇలాంటి ఏకగ్రీవ పంచాయతీల్లో ఎక్కువగా చిన్న గ్రామాలు, తండాలే ఉన్నాయి. సర్కారు నుంచి రూ.15లక్షలు వస్తే తండాలను అభివృద్ధి చేసుకోవచ్చన్న సర్పంచుల ఆశలు అడియాసలే అవుతున్నాయి.
సర్కారు చెప్పిన పనులు చేసి అప్పులపాలైనం
ఒకప్పుడు సర్పంచ్ అంటే ఎంతో గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు సర్పంచ్ అంటే విలువ లేకుండా పోయింది. పబ్లిక్ ముందు ఆఫీసర్లు చులకనగా మాట్లాడుతున్నరు. సర్కారు చెప్పిన పనులు చేసి అప్పులపాలైనం. ఇయ్యాల రాష్ట్రంలో అప్పులు లేని సర్పంచ్ లేడు. కనీసం గౌరవ వేతనం రాక ఇప్పటికి 11 నెలలు అయితంది.
– అతినేని గంగారెడ్డి, సర్పం చ్, అల్లీపూర్, జగిత్యాల
For More News..