నిర్మల్ జిల్లా: ఖానాపూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు బహిష్కరించారు. గ్రామ పంచాయతీల నిర్వహణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్ లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని.. దీంతో దైనందిన కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని.. కేంద్రం నుంచి గానీ ఎలాంటి నిధులు రావడం లేదని.. లేబర్లకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జీతాలపై ఆధారపడి బతికే కార్మికులకు జీతాలివ్వకపోతే పారిశుధ్య పనులు కుంటుపడతాయన్నారు. ఎప్పటికైనా బిల్లులు వస్తాయనే ఆశతో.. ఎంతో కొంత డబ్బులొస్తాయని పనులు చేసిన వారికి నెలల తరబడి డబ్బులివ్వకపోతే ఎలా అని నిలదీశారు. ప్రజా సమస్యల కోసం చర్చించే మండల సమావేశంలో చర్చలకు, తీర్మానాలకు విలువ లేకపోతే ఎందుకు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామాల్లో పరిస్థితిని గుర్తించి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.