బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో చేసిన పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. లేటెస్ట్ గా జగిత్యాల జిల్లా రాయికల్ మండల సర్పంచ్ లు సర్కార్ కు అల్టీమేటం జారీ చేశారు. ఏప్రిల్ చివరి వరకు బిల్లులు రాకపోతే 32 గ్రామాల సర్పంచ్ లు అందరూ మూకుమ్ముడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు రాయికల్ మండల ఎంపీడీవోకు ఆయా గ్రామాల సర్పంచ్ లు వినతి పత్రం అందజేశారు.
మనఊరు మనబడి , టీకేపీ బిల్లులు, పల్లె ప్రగతి బిల్లులు, సీసీ రోడ్ల బిల్లులు, ప్రతి నెల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన గ్రాంట్ రావడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఊర్లో పారిశుద్ధ్య కార్మికులుకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీవోలో జమ చేసిన చెక్కులపై ఉన్న ఫ్రీజింగ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరు వరకు బిల్లులు రాకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని సంతకాలు చేశారు.