ఇంటింటికీ మిషన్​భగీరథ ఎప్పుడిస్తరు?

తిమ్మాపూర్, వెలుగు: మిషన్​భగీరథ నీటిని ఇంటింటికీ ఎప్పుడిస్తారని కరీంనగర్​జిల్లా తిమ్మాపూర్ మండలంలోని సర్పంచులు అధికారులను నిలదీశారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య మాట్లాడుతూ.. తమ గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. హరితహారం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలతోపాటు గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని అధికారులను అడిగినా స్పందన లేదని రేణిగుంట సర్పంచ్ బోయిన్ కొమురయ్య నిరసన తెలిపారు. ఈనెల 6న ఎల్ఎండీ కాలనీలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని, ఆ సభలో తనను స్టేజి మీదకు పిలవకుండా అవమానించారని వచ్చునూరు సర్పంచ్ ఉమారాణిని కన్నీటి పర్యంతమయ్యారు. దళిత మహిళ అయినందుకే ఇలా చేశారని బాధపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంపీఓ కిరణ్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.