ఆదిలాబాద్ టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సర్పంచ్‌లు గురువారం జిల్లా ట్రెజరీ కార్యాలయం ఎదుట ఉరితాళ్లతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే ఆ నిధులను సర్పంచులకు తెలవకుండా మళ్లించుకున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీలు ఉన్నాయన్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులను ప్రభుత్వం తీసేసుకుంటుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సీఎంతో మాట్లాడి నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మయూర్ చంద్ర, బోయర్ విజయ్, అస్తక్, ఉజ్వల రతన్, రాకేష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి, రఘుపతి, దినేష్ మాటోలియా, తదితరులు పాల్గొన్నారు.