నిధుల మళ్లింపుపై సర్పంచుల నిరసనలు

నెట్​వర్క్, వెలుగు:  గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల నిరసనలు కొనసాగు తున్నాయి. బుధవారం హనుమకొండ​ కలెక్టరేట్​తోపాటు పలు జిల్లాల్లోని ఎంపీడీవో ఆఫీసుల ఎదుట ఆందోళన చేశారు. వరంగల్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు సర్పంచులు ప్రయత్నించగా.. వారిని పోలీ సులు అడ్డుకున్నారు. మంత్రి సర్పంచుల నుంచి వినతిపత్రం తీసుకోకుండానే వెళ్లిపోయారు.

ఫలించని బుజ్జగింపు ప్రయత్నాలు

రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. దీంతో హై కమాండ్​ వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్​పర్సన్​ కోవ లక్ష్మి బుధవారం సర్పంచులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫోన్​లో మాట్లాడి, సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినా వారంతా ససేమిరా అన్నట్లు తెలిసింది.

అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలి

పంచాయతీలకు రావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వెంటనే విడుదల చేసి అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలని హనుమకొండ జిల్లా సర్పంచుల ఫోరం డిమాండ్​ చేసింది. ఫోరం జిల్లా అధ్యక్షుడు అబ్బు ప్రకాశ్​ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేపట్టారు. 9 నెలలుగా రావాల్సిన నిధులను దారి మళ్లించారని, ఇది ఎంతవరకు సమంజసమని సర్పంచులు ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఫండ్స్​ వచ్చినా ఆఫీసర్లను బెదిరించి, అకౌంట్లన్నీ జీరో చేశారని మండిపడ్డారు. దారి మళ్లించిన నిధులను వెంటనే డిపాజిట్​ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వరంగల్ రూరల్​ జెడ్పీ మీటింగ్​కు హాజరైన మంత్రి ఎర్రబెల్లికి వినతిపత్రం ఇచ్చేందుకు సర్పంచులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు.

దొంగల్లాగా డిజిటల్​ కీలు అపహరించారు

రాష్ట్ర ప్రభుత్వం దొంగలాగా సర్పంచుల డిజిటల్ కీలు అపహరించి సీసీ చెక్కులు పాస్ చేయడం దారుణమని కరీంనగర్​ జిల్లా వెల్గటూర్ మండల సర్పంచులు మండిపడ్డారు. ఎంపీడీవో ఆఫీసు వద్ద నిరసన తెలిపి.. డిజిటల్ కీలు తిరిగి ఇప్పించాలని ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. నిధులను మళ్లించడంపై వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్​పార్టీ ఆందోళనకు దిగింది. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్​రెడ్డి, ఆ పార్టీ లీడర్లు పరిగిలోని బీజాపూర్ – హైదరాబాద్ హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోనూ పలువురు సర్పంచులు ఎంపీడీవో ఆఫీస్‌‌ ఎదుట నిరసన తెలిపారు. పంచాయతీల నిధులను గ్రామాల్లో అభివృద్ధి పనులకే వాడాలని డిమాండ్‌‌ చేశారు. ఆదిలాబాద్​ జిల్లా నార్నూర్​మండల సర్పంచులు ఎంపీడీవో ఆఫీస్ ​వద్ద నిరసన తెలిపి ఎంపీడీవో రమేశ్​కు వినతి పత్రం ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోనూ సర్పంచులు ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సర్పంచుల ఆత్మహత్యలు కనిపిస్తలేవా?

అప్పుల బాధతో సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవి రాష్ట్ర ప్రభుత్వా నికి కనిపించడం లేదా? అని కాంగ్రెస్ సర్పంచులు ప్రశ్నించారు. పెగడపల్లి ఎంపీడీవో ఆఫీస్ ముందు సర్పంచులు తాటిపర్తి శోభారాణి, గోలి మహేందర్ రెడ్డి, ఈరెల్లి శంకర్ ధర్నా చేశారు. సర్కారు చెప్పిన అభివృద్ధి పనులు చేయించి లక్షల మేర అప్పులపాలయ్యామని, ఇలాంటి టైంలో ఫైనాన్స్ ఫండ్స్​ ఇయ్యాల్సింది పోయి కేంద్రం ఇచ్చిన నిధుల్ని కాజేయడం దారుణమన్నారు. ఆ నిధులను వెంటనే అకౌంట్లలో జమచేయాలని, లేదంటే నిరసనలు చేపడ్తామని హెచ్చరించారు.

కేంద్రం పైసలు​ ఇస్తలేదు: మంత్రి ఎర్రబెల్లి

కేంద్రం పంచాయతీలకు రావాల్సిన రూ.700 కోట్లు ఆపిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వరంగల్​ రూరల్​ జెడ్పీ మీటింగ్​కు వచ్చిన ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం అప్పులు తెచ్చి సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని, కానీ, కేంద్రం ఫండ్స్​ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈజీఎస్​ కింద రావాల్సిన రూ.1,100 కోట్లు ఇవ్వలేదని, కల్లాలకు సంబంధించిన రూ.150 కోట్లు ఇస్తేనే ఆ నిధులు రిలీజ్​ చేస్తామని చెబుతోందన్నారు.