ఖమ్మం సభకు జనాన్ని తరలిస్తే సర్పంచులకు రూ.10లక్షలు ఇప్పిస్తా.. : మంత్రి ఎర్రబెల్లి

  • టార్గెట్​ పూర్తి చేయకపోతే అదనపు నిధులు ఉండవు
  • పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మరిపెడ, వెలుగు: బీఆర్ఎస్​ బహిరంగ సభకు టార్గెట్​ప్రకారం జనాల్ని తరలిస్తే సర్పంచులకు తన పంచాయతీరాజ్​శాఖ నుంచి రూ.10 లక్షల చొప్పున ఫండ్స్​ ఇప్పిస్తానని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఖమ్మం సభ కోసం వేసిన పార్టీ కమిటీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ కామెంట్స్​ చేశారు. సోమవారం ఇదే జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో దయాకర్​రావు మాట్లాడుతూ బీఆర్​ఎస్​కు చెందిన 25 మంది ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని,  వచ్చే ఎన్నికల్లో వారిని మారిస్తే  పార్టీ​ వంద సీట్లు గెలుస్తుందంటూ కలకలం రేపారు. ఈ వివాదం చల్లారకముందే తాజాగా  మరిపెడలో మరోసారి తన మార్కు చూపారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్  బహిరంగ సభ కోసం చిన్న పంచాయతీల నుంచి కనీసం 300, పెద్ద పంచాయతీల నుంచి 600 మంది వరకు తరలించాలని సర్పంచ్​లకు మంత్రి టార్గెట్​ పెట్టారు.  ఈ టార్గెట్​ రీచ్​ అయితే  సర్పంచులకు రూ.10లక్షల చొప్పున ఫండ్స్​ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

‘మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా పరిధిలోని అన్ని గ్రామపంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తానని సీఎం చెప్పారు.. ఇప్పుడు నేను చెప్తున్నా.. ఖమ్మం బహిరంగ సభకు టార్గెట్ ప్రకారం జన సమీకరణ చేసిన సర్పంచులకు నా పంచాయతీరాజ్​ శాఖ నుంచి అదనంగా రూ.10 లక్షల చొప్పున ఫండ్స్​ ఇప్పిస్తా.. టార్గెట్ పూర్తి చేయని వాళ్లకు అదనపు నిధులు కేటాయించడం జరగదు..’ అన్నారు.  దేశచరిత్ర పుటల్లోకి ఎక్కేలా ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా మారిందన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచారని, భారత దేశంలో ప్రజా, రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.