కల్లుగీత కుటుంబంలో పుట్టి.. వీరుడిగా ఎదిగాడు

  • నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

భారతదేశంపై 17వ శతాబ్దంలో మొగలుల వలస పాలన కొనసాగింది. స్థానిక రాజ్యాలు వారికి తలవంచాయి. దొరలు, జమీందారులు మొగల్ సైన్యాలకు తొత్తులుగా పనిచేస్తూ పేద ప్రజలను దోచుకునే వారు. దక్షిణ భారతదేశంలో మొగలుల దోపిడీని ఎదిరించి పోరాడింది ఇద్దరే ఇద్దరు. ఒకరు చత్రపతి శివాజీ మహారాజ్, మరొకరు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్. మొగలుల పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి వారిని దక్షిణాదిలో అడుగుపెట్టనియ్యలేదు. మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ పోరాడగా, గోదావరి, కృష్ణా, భీమా నదుల మధ్యనున్న తెలంగాణ, ఏపీ, కర్నాటకలోని చాలా ప్రాంతాల్లో పాపన్న  పోరాటం చేశాడు. దక్షిణ భారతదేశంలో 3/4 వంతు భూభాగాన్ని వీరిద్దరే పాలించారు. 
కల్లుగీత కుటుంబంలో పుట్టి

పాపన్న తెలంగాణలోని జనగాం జిల్లా ఖిలాషాపూర్ లో కల్లుగీత కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే పాపన్న తండ్రి(సర్దార్ ధర్మన్న) స్థానిక దొరలు, జమిందార్లకు వ్యతిరేకంగా పోరాడి వారి కుట్రలకు బలయ్యాడు. పాపన్న కూడా కల్లుగీత వృత్తి చేస్తూ దొరల గడీల్లో పశువుల కాపరిగా పనిచేశాడు. జమీందార్ల ఆగడాలకు విసిగి పోయి బహుజన కులాలకు చెందిన తన స్నేహితులను తిరుగుబాటుకు సిద్ధం చేశాడు. గ్రామాల్లో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ జమిందారును పాపన్న చంపేశాడు. దొరల గడీల్లో బందీలుగా ఉన్న అమాయకులకు విముక్తి కల్పించాడు. వారంతా పాపన్నకు సైన్యంగా మారి, గడీలను బద్దలుకొడుతూ, అన్ని ప్రాంతాల్లో దోపిడీ పాలనను అంతం చేశారు. దొరలు, జమీందార్లు పాపన్న దాడులను ఎదుర్కోలేక మొగల్ పాలకుల సాయం కోరి, మొగల్ సైన్యాలను రప్పించారు. ఔరంగజేబు వేల మంది సైనికులను పంపి పాపన్నను చంపాలని కుట్రచేశాడు. పాపన్న వాటిని ధీటుగా ఎదుర్కొన్నాడు.
14 లక్షల కప్పం కట్టి..
పాపన్న డచ్, ఇంగ్లీష్ ​వారి నుంచి ఫిరంగులు, తుపాకులను సమకూర్చుకున్నాడు. వేలాది గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు, సైనికబలం, ఆధునిక యుద్ధ సామాగ్రి ఉండటం వల్ల ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఖిలాషాపురంలో కోట కట్టించాడు. అక్కడి నుంచి ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ అక్కడ కోటలు నిర్మిస్తూ ప్రజాపాలన ఏర్పాటు చేశాడు. కర్నాటక ప్రాంతంలో బీదర్ నుంచి ఆంధ్రాలోని నెల్లూరు, మచిలీపట్నం వరకు తెలంగాణలోని అన్ని ప్రాంతాలను 30 ఏండ్లపాటు పాలించాడు.

మొగల్​లు పంపించిన హైదరాబాద్ గవర్నర్ జనరల్ రుస్తుమ్ ఖాన్, ఖాసీంఖాన్లను పాపన్న చంపేయడంతో దక్షిణాదిలో కాలు పెట్టాలంటేనే మొగలులకు వణుకు పుట్టేలా చేశాడు. ఔరంగజేబు మరణం, అతని కుమారులైన బహుదూర్ షాల మధ్య ఆధిపత్య పోరుతో మొగలుల పాలన స్తంభించింది. దీంతో సర్దార్ పాపన్న మహారాజ్ తిరుగులేని చక్రవర్తిగా, ప్రజా పాలకుడిగా అవతరించి దొరలు, భూస్వాముల దోపిడీపాలనను అంతమొందించాడు. తన రాజ్యానికి14 లక్షల కప్పం మొగల్ చక్రవర్తి బహుదూర్ షా కు చెల్లించి బహుజన రాజ్యస్థాపన చేశాడు. గోల్కొండ కోటను గెలిచి సంవత్సరంన్నరపాటు పాలించాడు.

పాపన్న ఢిల్లీ కోట జయించడానికి కుట్ర చేస్తున్నాడని కొందరు చాడీలు చెప్పడంతో, మొగల్ చక్రవర్తి బహుదూర్ షా పాపన్నను చంపడానికి సైన్యాన్ని పంపించాడు. ఊహించని విధంగా మొగలు సైన్యాలు కోటని చుట్టుముట్టడంతో పాపన్న తప్పించుకొని మారువేషంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో దాచుకున్నాడు. మొగల్​సైనికులు పాపన్న పోలికలతో ఉన్న వారందరినీ చంపుతూ ఉండగా, హుస్నాబాద్ లో ఓ వ్యక్తికి పాపన్న పోలికలు ఉన్నట్లు తెలిసింది. అతడిని చుట్టుముట్టి బంధించారు. తలనరికి ఢిల్లీలోని మొగల్ చక్రవర్తికి పంపారని, మొండెంను గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారని కేంబ్రిడ్జ్ పరిశోధకులు పేర్కొన్నారు. కానీ శత్రువులు చుట్టుముట్టగానే పాపన్న తన బల్లెంతో పొడుచుకొని చనిపోయాడని కళాకారులు పాటలు పాడేవారు.

చరిత్రకెక్కని పోరాటం

దేశంలో పాపన్న వీరోచిత పోరాటాన్ని చరిత్రకెక్కనివ్వలేదు. కానీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న పోరాటంపై అధ్యయనం చేసి చరిత్ర(ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది దక్కన్)ను పుస్తకాలుగా ప్రచురించారు. లండన్ విక్టోరియా, అల్బర్ట్ మ్యూజియంలో ఆయన చిత్ర పటాన్ని శిలాశాసనంగా భద్రపరిచింది. పాపన్న చరిత్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడానికి కారణం ఆయన అన్ని మతాలకు రక్షకుడిగా ఉండటమే. ఆ కాలంలో బడుగులను గుళ్లలోకి రానిచ్చేవారు కాదు. దాన్ని పాపన్న అంగీకరించలేదు. ఇలా అన్ని వర్గాల కోసం పోరాడిన పాపన్న చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి.

పార్లమెంట్ భవనంలో ఆయన విగ్రహం పెట్టాలి. పాపన్న జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. నాటి నుంచి నేటి వరకు ఆయన స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు పుట్టాయి. తెలంగాణ కూడా స్వయం పాలన సాధించుకోగలిగింది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా బహుజనులు ఇంకా అస్తిత్వం కోసం, సమానత్వం కోసం రాజకీయ చైతన్యం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పాపన్న ఒక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు. అందరివాడు. ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా బహుజనులందరూ ఏకమవడమే పాపన్నకు అర్పించే నిజమైన నివాళి.

 - సూదగాని హరిశంకర్ గౌడ్, ఛైర్మన్, సూదగాని ఫౌండేషన్.