
కరీంనగర్ టౌన్/ సిటీ, వెలుగు: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెట్లకు గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. వేసవి ఎండల తీవ్రతకు చెట్ల కొమ్మలు రాసుకొని మంటలు అంటుకున్నాయి. వర్సిటీ అధికారుల సమాచారంతో చేరుకున్న ఫైర్ ఇంజన్లతో సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఫైర్ఇంజన్లలో నీళ్లు అయిపోవడంతో ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ సంప్ నుంచి నీటిని తీసుకున్నారు. 4 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఫైర్ ఆఫీసర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో యూనివర్సిటీ బిల్డింగుల వైపు మంటలు వెళ్లలేదు. మంటలతో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందారు. కాగా రాత్రి 7గంటలకు మళ్లీ మంటలు రాగా ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు.