శాతవాహన వర్సిటీ ఉద్యోగుల లెక్కల్లో గందరగోళం

  •    పేపర్​పై కాంట్రాక్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్, ఎంటీఎం ఉద్యోగులు 410 మంది
  •     వర్సిటీలో పనిచేస్తున్నది 200 మందిలోపే.. 
  •     అడిషనల్ జాబ్స్​పై అనుమానాలు 
  •      డౌట్లు క్లియర్ చేయాలంటూ లెటర్ ​రాసిన ఈసీ సభ్యులు

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ ఉద్యోగుల లెక్కల్లో గందరళగోళం నెలకొంది. యాజమాన్యం లేని ఉద్యోగులను ఉన్నట్లు చూపిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు, కొందరు ఈసీ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్, మినిమం టైం స్కేల్ పద్ధతిలో మొత్తం 410 మంది పని చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. అంత మంది ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. వర్సిటీలో ప్రస్తుతం 200 మందికి మించి లేరని చెబుతున్నారు.

ఇందులోనే కాంట్రాక్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్, మినిమం టైం స్కేల్ పద్ధతిలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారంటున్నారు. మిగతా వారిని ఎప్పుడెప్పుడు, ఏయే పద్ధతిలో రిక్రూట్ చేసుకున్నారో చెప్పాలంటున్నారు. ఈ మేరకు కొందరు యూనివర్సిటీ ఈసీ(ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) సభ్యులు రిజిస్ట్రార్​కు లెటర్ రాయడం చర్చనీయాంశంగా మారింది. 

ఇన్నాళ్లు వీసీ సైలెంట్

యూనివర్సిటీ టీచింగ్ ఫ్యాకల్టీలో 78 మంది కాంట్రాక్ట్, 10 మంది పార్ట్ టైం లెక్చరర్లతోపాటు మెస్, హాస్టళ్లు, వివిధ డిపార్ట్ మెంట్లు, సెక్యూరిటీ తదితర విభాగాల్లో కలిపి 318 మంది ఔట్ సోర్సింగ్, నలుగురు మినిమం టైం స్కేల్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వీరి సర్వీసును ర్యాటిఫికేషన్ చేసి, కంటిన్యూ చేసేందుకు అనుమతి ఇవ్వాలని, రెమ్యునరేషన్ పెంచాలని  నిరుడు వర్సిటీ రిజిస్ట్రార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపారు. గతేడాది ఆగస్టు 7న ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీఓ నంబర్ 1222ను జారీ చేసింది.

అయితే వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం పొందలేదు. ఇన్నాళ్లు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న వీసీ ఈ నెల 6న నిర్వహించిన ఈసీ మీటింగ్ లో అంశాన్ని ఎజెండాగా చేర్చారు. మీటింగ్​కు వారం ముందు ఎజెండా కాపీలను సభ్యులకు అందజేయాల్సి ఉన్నప్పటికీ.. మీటింగ్ కు హాజరయ్యే వరకు సభ్యులకు అందలేదని తెలిసింది. ఈసీ మీటింగ్ లో ఈ అంశంపై చర్చించే సమయం లేకపోవడంతో సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. అయితే రెండు రోజులుగా ఈసీ ఎజెండా కాపీపై క్షుణ్ణంగా స్టడీ చేసిన కొందరు సభ్యులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాన్ని గుర్తించినట్లు సమాచారం. ఆరుగురు సభ్యులు సమావేశమై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ రిజిస్ట్రార్ కు లెటర్​రాశారు.

లేవనెత్తిన అంశాలివే..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవల యూనివర్సిటీ పాలసీలపై వస్తున్న ఆరోపణలు తమకు ఇబ్బందికరంగా మారిందని, జీఓ నంబర్ 1222కి సంబంధించి తమకు అస్పష్టమైన సమాచారం ఉందని, వాస్తవ సమాచారం ఇవ్వాలని ఈసీ సభ్యులు రిజిస్ట్రార్ ను లేఖలో కోరారు. జీఓ నం.1222 అమలుపై గతంలో ఈసీ ఆమోదం పొందలేదని, ఈసీ ఆమోదం లేకుండా ఆ జీఓలో పేర్కొన్న సర్వీసులను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు ఎలా అప్పగించారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. మొత్తం 185 మంది ఔట్ సోర్సింగ్(ఎస్ హెచ్ జీలు, వారధి, ఇతర ఏజెన్సీ) ఉద్యోగుల పేర్లు, హోదాలు, అనుభవం, అర్హతలు, అపాయింట్‌మెంట్ విధానం,

అపాయింట్‌మెంట్ తేదీ, జీతం వివరాలతో జాబితా అందించాలని, అలాగే వారి 6 నెలల పే స్లిప్పులను ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఆ 185 మంది ఉద్యోగుల హోదాలు మార్చినట్లయితే, ఆ నియామకాలను ఏ ప్రాతిపదికన మార్చారో చెప్పే ఆర్డర్ కాపీలను అందజేయాలని కోరారని తెలిసింది. యూనివర్సిటీలో 410 మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చెప్పారని, కానీ తమకు తెలిసి 185 మంది మాత్రమే ఉన్నట్లు లెటర్​లో పేర్కొన్నట్లు సమాచారం. మిగతా 225 మంది ఉద్యోగులు పని చేస్తున్నారా? చేయడం లేదా ? ఈ నియామకాలను ఈసీ ఆమోదించిందా? ఏ ప్రాతిపదికన సెలక్ట్ చేశారు ? అని లేఖలో వివరణ కోరినట్లు తెలిసింది. తమకు 77వ ఈసీ మీటింగ్ ఎజెండా కాపీని ఎందుకు అందించలేదో చెప్పాలని అడిగినట్లు సమాచారం. అంతేగాక తమ ఈసీ పదవీ కాలంలో జరిగిన అన్ని మీటింగ్స్ మినిట్స్, తీసుకున్న నిర్ణయాల కాపీని అందజేయాలని కోరినట్లు తెలిసింది.  

ఉద్యోగుల లెక్కలు బయట పెట్టాలి

శాతవాహన యూనివర్సిటీ ఉద్యోగుల లెక్కలపై అనుమానాలు ఉన్నాయి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం వర్సిటీలో185 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. మరో 225 మంది ఉన్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు. వీసీ తన రిటైర్మెంట్​కు ముందే ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్, రాష్ట్ర అధ్యక్షుడు