- రూ.10 కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్రైవేట్ వ్యక్తుల యత్నం
- ఆందోళనకు దిగిన విద్యార్థులపై యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు
- కబ్జాను అడ్డుకుంటున్నారా ? అప్పగిస్తున్నారా?
- ఈ వ్యవహారంలో యూనివర్సిటీ అధికారుల తీరుపై అనుమానాలు
కరీంనగర్, వెలుగు: కోట్లాది రూపాయల విలువైన శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ భూముల కబ్జాకు గురవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల స్పందనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మసీ కాలేజీ పక్కనే భూమిని కలిగి ఉన్న ఓ వ్యక్తి.. ఈ నెల 4న కాలేజీ భూమిని కూడా ఆక్రమించి చదును చేయడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యూనివర్సిటీ అధికారుల వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంపౌండ్ నిర్మించకపోవడంతో ఆక్రమణలు
శాతవాహన యూనివర్సిటీ ఎల్ఎండీ ఫార్మసీ కాలేజీ మొత్తం విస్తీర్ణం 42.14 ఎకరాల్లో ఉంది. ఇందులో ఆరేళ్ల కింద మౌలానా అబుల్ కలామ్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)కి 5 ఎకరాలు, సైన్స్ సెంటర్ కు 5 ఎకరాలు కేటాయించారు. ఇప్పటి వరకు వాటికి సంబంధించిన పనులు ప్రారంభించలేదు. మరో 1.5 ఎకరాలు సెంట్రల్ ఇండస్ట్రియల్ టూల్స్ & డిజైన్(సీఐటీడీ)కి కేటాయించారు.
ఈ పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 30.04 ఎకరాలను ఆక్రమించేందుకు పలువురు యత్నించడంతో అంతకుముందున్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, ఇన్‌చార్జి వీసీ టి.చిరంజీవులు కాంపౌండ్, హాస్టల్స్, ఇతర భవనాల నిర్మాణాలకు పర్మిషన్ తీసుకున్నారు. వీరు వెళ్లిపోయాక పనులు ముందుకు సాగలేదు. కాంపౌండ్ నిర్మించకపోవడంతో కబ్జాదారుల పని ఈజీ అయింది. దీంతో కాలేజీ చుట్టూ భూమి ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమణలకు యత్నిస్తున్నారు.
రూ.10 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నం
ఫార్మసీ కాలేజీ పక్కనే భూమి కలిగి ఉన్న వీరారెడ్డి అనే వ్యక్తి ఈ నెల 4న కాలేజీ ప్రిన్సిపాల్ వద్దకు వచ్చి భూమిని చదును చేసుకునేందుకు వీసీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పినట్లు తెలిసింది. దీంతో మీ భూమిలోనే చదును చేసుకోండి.. ఏమైనా డౌట్ ఉంటే యూనివర్సిటీ ఇంజినీర్‌ను అడగాలని చెప్పినట్లు సమాచారం. దీంతో తొలుత తన స్థలాన్ని చదును చేసి.. ఆ తర్వాత జేసీబీతో కాలేజీ భూమిలోకి ప్రవేశించి చదును చేయించాడు. షెడ్డు కూల్చివేయించాడు. మరుసటి రోజు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
సర్వే చేయకుండానే కనీలు..
కాలేజీ స్థలాన్ని చదును చేయించడంతో హద్దులు చెదిరిపోయాయి. ఫార్మసీ కాలేజీ భూమి ఎక్కడి వరకు ఉందనే క్లారిటీ లేకుండా పోయింది. సుమారు రూ.10 కోట్ల విలువైన ఎకరం భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. సర్వేయర్ తో మరోసారి హద్దులను నిర్ధారించి కనీలు పాతాల్సి ఉండగా.. ఇదేమీ చేయకుండా వీసీ ఆదేశాలతో హడావుడిగా తమకు తోచిన చోట కనీలు పాతడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై శనివారం ఏబీవీపీ నాయకులు చేరుకుని కాలేజీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు వదిలేసి కనీలు పాతారని ఆరోపిస్తూ వాటిని కూల్చివేశారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి కాంపౌండ్నిర్మించాలని డిమాండ్ చేశారు. వీసీ, రిజిస్ట్రార్ కబ్జాదారులతో కుమ్మక్కై తప్పుగా కనీలు పాతించారని ఆరోపించారు. అయితే ఏబీవీపీ లీడర్లపై ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కబ్జాలను ప్రశ్నిస్తే తమ మీద కేసులు పెట్టడం ఏంటని ఏబీవీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.