కరీంనగర్ : హాస్టల్ లో వంట మనిషి లేక వేళకు తిండిపెట్టడం లేదని శాతవాహన యూనివర్సిటీ బీఫార్మసీ విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్ లో పెడుతున్న తిండి తినలేకపోతున్నామని ఆందోళనకు దిగారు. గత 15 రోజులుగా తిండి కోసం ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిన కుక్ రాకపోవడంతో టిఫిన్ లేక ఖాళీ ప్లేట్లతో రోడ్డుపైకి వచ్చి యూనివర్సిటీకి ర్యాలీగా బయలుదేరారు.
విద్యార్థుల నిరసన ర్యాలీ గురించి తెలుసుకున్న ప్రొఫెసర్లు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వీలైనంత తొందరగా సమస్య పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 15 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నామని అయినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.