ఔటర్ రింగ్ రోడ్డు ​బయట శాటిలైట్​ టౌన్​షిప్​లు

ఔటర్ రింగ్ రోడ్డు ​బయట శాటిలైట్​ టౌన్​షిప్​లు
  • వంద ఎకరాల జాగా ఉంటేనే పర్మిషన్​
  • నిర్మాణదారులను ప్రోత్సహించాలని హెచ్ఎండీఏ నిర్ణయం
  • ప్రైవేట్​ సంస్థలతో కలిసి నిర్మాణానికీ సన్నాహాలు
  • ట్రాఫిక్​ ఒత్తిడి, అభివృద్ధి వికేంద్రీకరణకు సర్కారు ఉపాయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఔటర్​ రింగ్ ​రోడ్​అవతల శాటిలైట్​ టౌన్​షిప్​ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టౌన్​షిప్​ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్ఎండీఏ వెంటనే అనుమతులివ్వనున్నది. ఇప్పటికే టౌన్​షిప్​ పాలసీ కూడా రూపొందించింది.

టౌన్​షిప్​ల నిర్మాణానికి ఎంత భూమి ఉండాలి?  పర్మిషన్లకు ఏఏ పత్రాలు జత చేయాలి? ఎంత ఫీజు కట్టాలన్న దానిపై ఇప్పటికే హెచ్ఎండీఏ విధి విధానాలు రూపొందించింది. కేవలం ప్రైవేట్​వ్యక్తులను ప్రోత్సహించడమే కాకుండా ప్రైవేట్​ భాగస్వామ్యంతో టౌన్​షిప్​ల అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి కొంతకాలం కిందటే అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 

ఎంత భూమి కావాలంటే...

ఔటర్ శివార్లలో టౌన్ షిప్​ల నిర్మించాలనుకునే వారు కనీసం 100 ఎకరాలు కలిగి ఉండాలని హెచ్ఎండీఏ రూల్​పెట్టింది. ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్​పాలసీలో దీన్ని మెన్షన్​ చేశారు. కొన్ని నెలల క్రితం నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు రెండు సంస్థలు టౌన్ షిప్​ల నిర్మాణానికి ముందుకు వచ్చాయని ఆఫీసర్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం దామర్లపల్లిలో 500 ఎకరాల్లో టౌన్​షిప్​నిర్మాణానికి ఒక సంస్థ దరఖాస్తు చేసుకోగా, మరో సంస్థ 100 ఎకరాల్లో నిర్మాణానికి అప్లికేషన్​పెట్టుకుందని అధికారులు తెలిపారు.

అయితే టౌన్​షిప్​లకు వంద అడుగుల అప్రోచ్​రోడ్ కూడా​తప్పనిసరిగా ఉండాలని, నోటిఫికేషన్​లో పొందుపర్చిన మౌలిక వసతులన్నీ కూడా కచ్చితంగా అమలు చేయాలని కూడా నిబంధన విధించినట్టు తెలిపారు. టౌన్​షిప్​ల నిర్మాణానికి చేంజ్ ల్యాండ్​(భూ మార్పిడి) అనుమతులు అవసరం లేదని  స్పష్టం చేసింది.

ప్రభుత్వ భూముల కోసం వేట..

 ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తే ప్రోత్సహించడంతో పాటు హెచ్ఎండీఏ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో టౌన్​షిప్​ల నిర్మాణానికి రెడీగా ఉంది. హెచ్ఎండీఏ నిర్మించాలనుకుంటున్న టౌన్​షిప్​ల కోసం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరా తీస్తోంది. టౌన్​షిప్​లలో తప్పనిసరిగా ఆట స్థలాలు, రోడ్లు, ప్రజా రవాణా, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటు కూడా తప్పనిసరి అని స్పష్టం చేస్తోంది. అభివృద్ధిని నగరంతో సరిపెట్టకుండా నలుదిశలా విస్తరించాలనే ప్లాన్​లో భాగంగానే ప్రభుత్వం ఈ ఉపాయం చేసింది.