Sathi Gani Rendu Ekaralu Review: పుష్ప సినిమాలో కేశవగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ సత్తిగాని రెండెకరాలు. మైత్రీ మూవీ మేకర్సే నిర్మించిన ఈ మూవీ మే 26 శుక్రవారం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రిలీజైంది. మరి సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ:
సత్తి( జగదీష్ ప్రతాప్ బండారి)భార్య ఇద్దరు పిల్లలతో కొల్లూరు గ్రామంలో ఉంటూ.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. అతనికి రెండెకరాల పొలం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఆ రెండు ఎకరాలు మాత్రం అమ్మొద్దని చిన్నప్పుడే తాత చెప్తాడు. పెద్దయ్యాక సత్తికి ఒక పెద్ద కష్టం వస్తుంది. అర్జెంట్ గా రూ.30 లక్షలు కావాల్సివస్తుంది. మరి డబ్బుల కోసం సత్తి రెండెకరాలు అమ్మాడా? ఆ డబ్బులు ఎలా సెట్ చేసుకున్నాడు? అనేది మిగలిన కథ.
రివ్యూ:
ఈ మధ్య ప్రాంతీయ సినిమాలకు మంచి ఆదరణ బాగా లభిస్తోంది. సత్తిగాని రెండెకరాలు కూడా ఆ తరహా సినిమానే. దర్శకుడు అభినవ్ రెడ్డి దండ ఈ సినిమాలో కామెడీకి పెద్దపీట వేశాడు. కానీ కథలో కొత్తదనం కరవడింది. ప్రారంభం నుండి సినిమాలో పెద్దగా ఆకట్టుకునే సీన్స్ ఏమి కనిపించవు. కానీ సూట్‌కేసు ఎంటర్ ఐన తర్వాత సినిమాలో వేగం పుంజుకుంటుంది. ఆ కోవలో వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ కూడా బాగానే డీల్ చేశాడు డైరెక్టర్. మనిషి జీవితంలో వచ్చే కొన్ని సందర్భాలు చెడువైపు అడుగులు వేసేలా చేయడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్ లోనే సినిమా నడుస్తుంది కానీ స్క్రీన్ ప్లే అంత బాగా సెట్ అవలేదనే చెప్పాలి.
నటీనటులు,సాంకేతిక నిపుణులు:
ఇక జగదీష్ ప్రతాప్ బండారి నటన బాగుంది. అతడి స్నేహితుడిగా రాజ్ తిరందాస్ యాక్టింగ్ కూడా బాగుంది. ఇక వెన్నెల కిశోర్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో బలమైన ఒక పాజిటీవ్ పాయింట్ ఏదైనా ఉందటే అది వెన్నెల కిశోరే. మిగతా నటీనటులందరూ తమ పాత్రల మేర బాగానే నటించారు. సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి కెమరా వర్క్ సూపర్. జై క్రిష్ నేపథ్య సంగీతం, పాటలు కథలో సాగుతూ ప్రేక్షకులను అలరించాయి. ఇక మొత్తంగా చెప్పాలంటే సత్తిగాని రెండెకరాలు మూవీ ఒక రోట్టీస్ కామెడీ డ్రామా మూవీ. మీకు బాగా టైం ఉంటె ఒకసారి చూసేయ్యొచ్చు.