కల్లూరు, వెలుగు : డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని కొర్లగూడెం, పేరువంచ, కల్లూరు పంచాయతీ పరిధిలోని, ఎన్ఎస్పీ కాలనీ, ఖాన్ ఖాన్ పేట ప్రతాప్ అపార్ట్మెంట్స్, పుల్లయ్య బంజర్ రోడ్డు, వెల్లంకి ఎస్టేట్ కాలనీ, జిడిబిపల్లి తదితర గ్రామాల్లో రూ.1.20కోట్లతో నిర్మించిన, సీసీ రోడ్లు, పల్లె దవాఖానాలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్‌ను ప్రారంభించారు. రూ.కోటితో కొత్తగా నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమ కానుందని తెలిపారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి త్వరలోనే ఇండ్లు అందజేస్తామని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాప్రభాకర్ చౌదరి, ఎంపీడీవో దయగల చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.