
- తెలుగు రాష్ట్రాల్లో 43 కేసులు
- రూ. 45 లక్షల సొత్తు రికవరీ
- సత్తుపల్లి సీపీ సునీల్ దత్ వెల్లడి
సత్తుపల్లి, వెలుగు : గూగుల్ మ్యాప్‌లో చూసి, వెంటనే తప్పించుకునేలా ప్లాన్ చేసుకుని ఇండ్లలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సీపీ సునీల్ దత్ మీడియాకు వివరాలు తెలిపారు. ఈనెల 10న రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి కనిపించగా కానిస్టేబుల్ నరేశ్ కుమార్ కు పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడిచేసి పారిపోయాడు.
నిఘాపెట్టి మంగళవారం పట్టణ సీఐ కిరణ్, ఎస్ఐ కవిత అదుపులోకి తీసుకుని అంతర్రాష్ట్ర దొంగ తిరవీధుల సురేంద్రగా గుర్తించారు. అతడిది ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తూరు. కాగా నిందితుడు తాపీ మేస్త్రీ గా పని చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో 90కి పైగా నేరాలు చేశాడు. జైలులో శిక్ష అనుభవిస్తూ గతేడాది నవంబర్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.
3 నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 43 చోరీలు చేశాడని సీపీ వివరించారు. అతను శ్మశాన వాటికలో ఉంటూ చోరీలకు పాల్పడుతూ అక్కడే చోరీ సొత్తు దాస్తుంటాడు. కొత్తూరులోని వైకుంఠ ధామంలో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 461.18 గ్రాముల బంగారు, 424 గ్రాములు వెండి ఆభరణాలు,14 సెల్ ఫోన్లు, 2 బైక్ లు, రూ. 3. 33 లక్షల నగదు రికవరీ చేశారు. రెండు రాష్ట్రాల్లో 43 కేసుల్లో నిందితుడి వద్ద ఇప్పటివరకు రూ. 45 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.