
సత్యరాజ్ లీడ్ రోల్‌లో మోహన్ శ్రీవత్స తెరకెక్కిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. దర్శకుడు మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి ‘అనగా అనగా కథలా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ కంపోజ్ చేసిన ఈ పాటను కార్తీక్ పాడాడు.
మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని వివరిస్తూ సనరే రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. పాట తరహాలోనే సినిమా కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని సత్యరాజ్ అన్నారు. 170 చిత్రాల్లో హీరోగా నటించిన సత్యరాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉందని దర్శకనిర్మాతలు చెప్పారు. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ ఇందులో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.