వనపర్తి, వెలుగు: మూడు సర్వేల్లో మేఘారెడ్డికి అనుకూలంగా ఫలితాలు వచ్చినా, హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి మాజీ మంత్రి చిన్నారెడ్డి టికెట్ పొందారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, మేఘారెడ్డి అనుచరులు విమర్శించారు. శనివారం పట్టణంలోని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఇంట్లో వారు మీడియాతో మాట్లాడారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, సతీశ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ తదితరులు చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని తాము ఒప్పుకోమని తెలిపారు. సర్వేకు విరుద్ధంగా ఏఐసీసీపై ఒత్తిడి తెచ్చి టికెట్ పొందిన చిన్నారెడ్డికి ప్రజల్లో మద్దతు లేదన్నారు.
మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఎన్నికల ముందు టికెట్ కోసం చిన్నారెడ్డి పాకులాడడం పార్టీకి నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకుల మాటలను ఖాతరు చేయకుండా పోటీలో ఉంటే, మేఘారెడ్డి రెబల్ గా పోటీలో ఉంటారని చెప్పారు. అచ్యుత రామారావు, వస్యానాయక్, ఉమ్మళ్ల రాములు పాల్గొన్నారు.
టికెట్ పై హైకమాండ్ పునరాలోచించాలి..
గోపాల్ పేట: వనపర్తి కాంగ్రెస్ టికెట్ చిన్నారెడ్డికి ఇస్తే ఓడిపోతాడని తెలిసినా హైకమాండ్ ఎందుకిచ్చిందని యువజన కాంగ్రెస్, ఆర్టీఐ జిల్లా చైర్మన్ కొంకి రమేశ్, శివన్నఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేఘారెడ్డి 90 శాతం గెలుస్తాడని తెలిసినా టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హైకమాండ్ పునరాలోచించి సర్వే ఆధారంగా టికెట్ కేటాయించాలని కోరారు.
రెబల్ గా బరిలో ఉంటా..
జడ్చర్లటౌన్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ రెండో లిస్ట్‌లో తన పేరు లేకపోవడం భాధాకరమని, హైకమాండ్ తనకు అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని తన ఇంట్లో అనుచరులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానుల నిర్ణయం మేరకు జడ్చర్ల బరిలో ఉంటానని ప్రకటించారు. నవంబర్ 9న నామినేషన్ వేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తనకు జడ్చర్ల టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ తరువాత సర్వే ప్రకారం టికెట్లు కేటాయిస్తామని చెప్పి అనుకూలంగా రిపోర్టు వచ్చినా తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ విషయంలో హైకమాండ్ పునరాలోచించాలన్నారు.