శని గ్రహం 18 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం చేయబోతుంది. అది భారతదేశంలో కనిపించబోతోంది. దీన్ని మనం నేరుగా చూడవచ్చు. ఈ అద్భుత దృశ్యం ఎప్పుడు ఆవిష్కృతం కాబోతుందో తెలుసుకుందాం.
సాధారణంగా సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం గురించి వినడం, చూడటం చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. శని గ్రహం ఆకాశంలో కనువిందు చేయబోతుంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యం 18 ఏళ్ల తర్వాత భారత్‌లో కనిపించనుంది. ఈ దృశ్యం భారతదేశంలో జూలై 24–-25 అర్ధరాత్రి కనిపిస్తుంది.
ఈ సమయంలో శని చంద్రుని వెనుక దాక్కుంటుంది. శని వలయాలు చంద్రుని వైపు నుండి కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యోమగాములు దీనిని అధ్యయనం చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనినే శని చంద్రగ్రహణం అని పిలుస్తారు. మనం కళ్లతో నేరుగా వీక్షించవచ్చు.
ఎప్పుడు ఏర్పడుతుంది?
జూలై 24 మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఆకాశంలో ఈ దృశ్యం కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1:44 గంటలకు చంద్రుడు ... శని గ్రహాన్ని పూర్తిగా తన వెనుక దాచుకుంటాడు. 25 తేది తెల్లవారుజామున 2:25 గంటలకు శని గ్రహం చంద్రుని వెనుక నుండి ఉద్భవించడం కనిపిస్తుంది. కొన్ని గంటల పాటు ఈ ఖగోళ దృశ్యం కనువిందు చేస్తుంది.
Also Read:-కరోనా తర్వాత పెరిగిన సమస్య.. దేశంలో 24శాతం మందికి ఒబెసిటీ
భారత్ తో పాటు ....
ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యం భారత్ లోనూ కనిపించనుంది. భారతదేశంతో పాటు, శ్రీలంక, మయన్మార్, చైనా, జపాన్‌లలో కూడా ఈ దృశ్యాన్ని వేర్వేరు సమయాల్లో చూడవచ్చు. దీని శని చంద్రగ్రహణం అని పేరు పెట్టారు. రెండు గ్రహాలు తమ వేగంతో కదులుతున్నప్పుడు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడు శని చంద్రుని వెనుక నుండి పైకి లేచినట్లు కనిపిస్తుంది. శని వలయాలు ముందుగా కనిపిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులు అంటున్నారు.
మూడు నెలల తర్వాత మళ్ళీ...
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ దృశ్యాన్ని కంటితో మాత్రమే చూడవచ్చు. అయితే శని గ్రహ వలయాలను చూడాలంటే చిన్న టెలిస్కోప్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని చూడటం మిస్ చేసుకున్నట్టయితే బాధపడాల్సిన అవసరం లేదు.మూడు నెలల తర్వాత మళ్లీ భారత్‌లో ఈ దృశ్యం కనిపించి కనువిందు చేయబోతుంది. మేఘాల కారణంగా జులైలో కనిపించకుంటే అక్టోబర్ 14 వరకు ఆగాల్సిందేనని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్టోబరు 14 రాత్రి స్పష్టమైన ఆకాశంలో శనిగ్రహ చంద్రగ్రహణం మళ్లీ కనిపిస్తుంది.