మలేసియా ఓపెన్‌‌ సూపర్‌‌–1000 టోర్నీ క్వార్టర్స్‌‌లో సాత్విక్‌‌–‌చిరాగ్‌‌

కౌలాలంపూర్‌‌ : ఇండియా డబుల్స్‌‌ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌.. షెట్టి మలేసియా ఓపెన్‌‌ సూపర్‌‌–1000 టోర్నీలో క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ 21–15, 21–15తో మలేసియా జోడీ ఎన్‌‌ అజ్రియాన్‌‌–టాన్‌‌ వాక్‌‌పై నెగ్గారు. 43 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ జంట స్మాష్‌‌లు, ర్యాలీలతో హోరెత్తించింది. మెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ప్రణయ్‌‌ 8–21, 21–15, 21–23తో ఏడోసీడ్‌‌ లీ షి ఫెంగ్‌‌ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. గంటా 22 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ప్లేయర్‌‌ తొలి గేమ్‌‌లో నిరాశపర్చినా రెండో గేమ్‌‌లో ఆకట్టుకున్నాడు.

బలమైన స్మాష్‌‌లు, క్రాస్‌‌ కోర్టు విన్నర్లతో దూసుకుపోయాడు. అయితే హోరాహోరీగా సాగిన డిసైడర్‌‌లో స్టార్టింగ్‌‌లో ప్రణయ్‌‌ ఆధిపత్యం చూపెట్టినా ఎండ్‌‌ గేమ్‌‌లో కొద్దిగా ఇబ్బందిపడ్డాడు. అయినా 21–21తో స్కోరు సమం చేసి రేస్‌‌లోకి వచ్చినా చివర్లో ఫెంగ్‌‌ కొట్టిన రెండు స్మాష్‌‌లను అందుకోలేకపోయాడు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో మాళవిక బన్సోద్‌‌ 18–21, 11–21తో హన్‌‌ యు (ఇండోనేసియా) చేతిలో ఓడింది.

విమెన్స్‌‌ డబుల్స్‌‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్‌‌ 21–15, 19–21, 19–21తో జియా యి ఫాన్‌‌–జాంగ్‌‌ షు జియాన్‌‌ (చైనా) చేతిలో, మిక్స్‌‌డ్‌‌లో ధ్రువ్‌‌ కపిల–తనీషా క్రాస్టో 13–21, 20–22తో ఏడోసీడ్‌‌ చెంగ్‌‌ జియాంగ్‌‌–జాంగ్‌‌ చి (చైనా) చేతిలో, సతీశ్‌‌–ఆద్యా 10–21, 17–21తో గో సున్‌‌ హట్‌‌–లాయ్‌‌ షివెన్‌‌ జెమీ (మలేసియా) చేతిలో ఓడారు.