- ఇండోనేసియా ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం
- బీడబ్ల్యూఎఫ్ సూపర్1000 ఈవెంట్ నెగ్గిన ఇండియా జంటగా రికార్డు
ఇండియా బ్యాడ్మింటన్ డైనమైట్స్.. తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్, మరాఠా యువకుడు చిరాగ్ షెట్టి కొత్త చరిత్ర సృష్టించారు. దేశంలో మునుపెన్నడూ.. మరెవ్వరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు. కొన్నేళ్లుగా రాకెట్లతో రప్ఫాడిస్తున్న ఈ ఇద్దరు మొనగాళ్లు ఇండోనేసియా ఓపెన్ మెన్స్ డబుల్స్‌లో చాంపియన్లుగా నిలిచారు. తద్వారా ఓ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000 ఈవెంట్ టైటిల్ నెగ్గిన ఇండియన్స్‌గా రికార్డుకెక్కారు. ఇప్పటికే దేశంలో నంబర్ వన్ డబుల్స్ షట్లర్లుగా ఉన్న ఈ యంగ్‌స్టర్స్ వరల్డ్ నంబర్ వన్ దిశగా దూసుకెళ్తున్నారు.
జకర్తా:
బ్యాడ్మింటన్ డ‘బుల్లెట్స్’ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. బీడబ్ల్యూఎఫ్ ఇండోనేసియా ఓపెన్ సూపర్1000 టోర్నమెంట్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన ఈ ఇద్దరు మెన్స్ డబుల్స్‌లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–17, 21–18తో వరల్డ్ చాంపియన్స్ ఆరోన్ చియా–సొ వూయి యిక్ (మలేసియా)పై వరుస గేమ్స్‌లో విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లోనే వరల్డ్ నంబర్ వన్ జంటను ఓడించి సంచలనం రేకెత్తించిన సాత్విక్, చిరాగ్ అదే ఊపును ఫైనల్ వరకూ కొనసాగించారు. ఫైనల్ ప్రత్యర్థులతో గతంలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఓడిన ఇండియా యంగ్‌స్టర్స్ ఈసారి మాత్రం ఆ రిజల్ట్‌ను రిపీట్ కానివ్వలేదు. 9వ ప్రయత్నంలో ఆరోన్– సొ వూయి పని పట్టి కెరీర్‌లో అతి పెద్ద విక్టరీ సొంతం చేసుకున్నారు. నెట్ వద్ద వేగంగా కదిలిన చిరాగ్ తెలివిగా షటిల్‌ను రిటర్న్ చేయడంతో పాటు డిఫెన్స్‌తో ఆకట్టుకోగా.. సాత్విక్ తనమార్కు జంప్ స్మాష్‌లతో బలమైన ఎటాకింగ్ చేసి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదటి గేమ్‌లో ఆరంభంలోనే 3–7తో వెనుకబడిన ఇండియన్స్ మధ్యలో జోరు పెంచి వరుసగా ఆరు పాయింట్లతో 9–7తో లీడ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ప్రత్యర్థులకు ఎలాంటి చాన్స్ కూడా ఇవ్వలేదు. రెండో గేమ్‌లో స్టార్టింగ్‌లో హోరాహోరీ పోరాటం జరగ్గా.. వరుస పెట్టి పాయింట్లు నెగ్గిన సాత్విక్, చిరాగ్ 11–7తో స్పష్టమైన ఆధిక్యంతో ఫస్టాఫ్ ముగించారు. దాన్ని చివరి వరకూ కాపాడుకుంటూ ఈజీగా గేమ్‌తో పాటు మ్యాచ్ సొంతం చేసుకున్నారు. టైటిల్‌తో పాటు రూ. 75.77 లక్షల ప్రైజ్‌మనీ ఖాతాలో వేసుకున్నారు. ఈ టోర్నీలో గతంలో సైనా నెహ్వాల్ (2010, 2012), కిడాంబి శ్రీకాంత్ (2017) సింగిల్స్ టైటిళ్లు నెగ్గారు. డబుల్స్‌లో ఇన్నాళ్లకు సాత్విక్, చిరాగ్ విజేతలుగా నిలిచారు.
ఈ రోజు మాదే అనుకున్నాం
టోర్నీ కోసం చిరాగ్, నేను పక్కాగా ప్రిపేర్ అయ్యాం. ఫ్యాన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. మొత్తంగా ఈ వారం అద్భుతంగా గడిచింది. ఈ రోజు గొప్పగా ఆడాము. ఫైనల్ అపోనెంట్స్‌తో మా హెడ్ టు హెడ్ రికార్డు బాగాలేదు. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ఒక్కో పాయింట్ గెలుస్తూ ముందుకెళ్లాలని అనుకున్నాం. తొలి గేమ్‌లో లీడ్ రాగానే ఇక ఇది మా రోజు అనుకున్నాం. ఎలాంటి ఆందోళన చెందనకుండా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నాంఈ టోర్నీ గెలవడం కంటే వాళ్లను ఓడించడం మా కెరీర్‌లో అత్యుత్తమ క్షణాల్లో ఒకటి. పోయిన రెండు నెలలు బాగా ఆడలేకపోయిన మాకు ఈ పెర్ఫామెన్స్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మా కోచ్‌లు, ఫిజియోలు, ట్రైనర్ల సపోర్ట్‌తో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాం.
నాది త్వరగా గాయపడే శరీరం. నా కోసం తెరవెనుక ఎంతో కష్టపడ్డ ఫిజియోలు, ట్రైనర్లకు కూడా ఈ విజయంతో క్రెడిట్ దక్కుతుంది. గోపీ సార్ కూడా చాలా కాలం తర్వాత మా మ్యాచ్‌లకు వచ్చారు. ఆయన పక్కన ఉంటే నేను చాలా పాజిటివ్‌గా ఉంటా. ఇండోనేషియాలో గెలవడం అంత ఈజీ కాదు. ఇక్కడ చాలా మంది చాలా మంది లెజెండ్స్ ఇక్కడ ఆడతారు. ఇది మా డ్రీమ్ టోర్నమెంట్‌లలో ఒకటి. ఇక్కడ ఆడే అవకాశం లభించడం నుంచి విన్నర్లుగా నిలవడం సుదీర్ఘ ప్రయాణంలా అనిపిస్తోంది.
- సాత్విక్ సాయిరాజ్