న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీలో మనోళ్ల పోరాటం ముగిసింది. భారీ ఆశలు పెట్టుకున్న డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టి కూడా సెమీస్‌లోనే వెనుదిరిగారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ 18–21, 14–21తో గో జి ఫి–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) చేతిలో ఓడారు.
37 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మాత్రమే ఇండియా ద్వయం గట్టి పోటీ ఇచ్చింది. బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో స్కోరును సమం చేసింది. అయితే కీలక టైమ్‌లో మలేసియా జోడీ నెట్ వద్ద మెరుగైన డ్రాప్స్ వేసి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సాత్విక్–చిరాగ్ కాస్త ఆధిపత్యం చూపెట్టినా క్రమంగా వెనకబడ్డారు. గో జి ఫి–నూర్ బలమైన క్రాస్ కోర్టు విన్నర్లతో ఈజీగా గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.