
స్టార్ హీరోస్ కార్తి (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swami) లీడ్ రోల్స్‌లో ‘96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’ (Satyam Sundaram). 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న థియేటర్లలలో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించింది.
సత్యం సుందరం ఓటీటీ:
ఈ నేపథ్యంలో ఓటీటీ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అయింది. థియేటర్లో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ వచ్చే ఆదివారం (అక్టోబర్ 27) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ, తెలుగు భాషలతో పాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' లో.. శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించారు.
కథేంటంటే::
ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి)ది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెం. సత్యం తండ్రి రామలింగం (జయప్రకాష్) హెడ్మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోకుండా రామలింగం ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. రామలింగం కుటుంబం మూడు తరాలుగా నివసిస్తున్న ఇళ్లు బంధువుల పరం అవుతుంది. దాంతో సొంతూరు ఉద్ధండరాయునిపాలెం వదిలేసిన సత్యం...తండ్రితో కలిసి వైజాగ్‌లో సెటిల్ అవుతాడు. అయితే, సత్యంకి ఆ ఊరన్నా.. అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఏళ్లు గడిచిపోతాయి.
అయితే ఇన్నేళ్లు గడిచినా సత్యంను తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. 20 ఏళ్లయినా బంధువులు చేసిన మోసాన్ని రామలింగం మరచిపోలేకపోతాడు. వారి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడడు. చాలా ఏళ్ల తర్వాత చిన్నాన్న కూతురు భువన (స్వాతి) పెళ్లికి కోసం సత్యమూర్తి తప్పనిసరి పరిస్థితుల్లో సొంతూరికి వస్తాడు. భువన పెళ్లి దగ్గర సత్యమూర్తికి బావ అంటూ ఒక వ్యక్తి సుందరం (కార్తీ) తారసపడతాడు. తన బంధువులు సైతం ఆ వ్యక్తితో బాగానే మాట్లాడతారు కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా సత్యమూర్తి తనలో తానే ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎన్ని విధాలుగా చేసినఎప్పుడు వెంటే ఉండడంతో ఆ ప్రయత్నాలు సఫలం కావు. కానీ సత్యం మాత్రం సుందరాన్ని గుర్తుపట్టడు. అతడి పేరు కూడా మర్చిపోతాడు. ఆ విషయం సుందరానికి తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగా నటిస్తాడు.
అంతేకాకుండా మొదట్లో సుందరం అతి వాగుడు.. మితిమీరిన కలుపుగోలుతనం చూసి తనని జిడ్డులా భావిస్తాడు సత్యం. కానీ, కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. చివరికి అతను ఎవరో సత్యమూర్తి ఎలా తెలుసుకున్నాడు? అసలు బావా అంటూ సత్యమూర్తి వెంటపడుతున్నది ఎవరు? ఎవరికి చెప్పకుండా సుందరం ఇంట్లో నుంచి సత్యం ఎందుకు పారిపోయాడు? సత్యం చేసిన ఓ మంచి సుందరం జీవితాన్ని ఎలా మార్చింది?సత్యమూర్తి వదిలేసిన సైకిల్ ఒక కుటుంబం మొత్తాన్ని ఎలా నిలబెట్టింది? కుటుంబాలు కలిసాయా లేదా ? ఇక వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? అనే తదితర విషయాలు తెలియాలంటే సత్యం సుందరం సినిమాను చూడాల్సిందే.
Also Read :- క్రేజీ ప్రమోషన్స్తో ఢిల్లీ యూత్లో జోష్ నింపిన సూర్య, దిశ పటానీ
ఇదొక ఫ్యామిలీ డ్రామా. కార్తి, అరవింద్ స్వామి పాత్రల మధ్య ఒక రాత్రిలో ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది అనేది ప్రధాన కథ.కార్తి అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి అర్బన్ పర్సనాలిటీగా కనిపించాడు. ఇక ఈ కథలో గొప్ప విషయం ఒకటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫైట్లు, ఇమేజ్‌లు, కామెడీ, లవ్ ట్రాక్‌లు ఇలా ఎక్సట్రా అట్ట్రాక్షన్స్ ఏవీ ఉండవు.
సత్యం సుందరంని నడిపించేది కేవలం కథ మాత్రమే.అందుకు అల్లుకున్న పాత్రల బంధాలు, వారి మధ్య సాగే భావోద్వేగాలు సినిమాని తారాస్థాయికి తీసుకెళ్లాయి. అంతేకాదు.. కార్తి, అరవింద్ స్వామిలలో ఎవరు ఓకే చెప్పకపోయినా ఈ సినిమా తీసేవాడిని కాదు. వాళ్ళిద్దరే ఆ పెర్ఫార్మెన్స్ చేయగలరు. వాళ్ళ కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని..డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ప్రమోషన్స్ లో చెప్పింది అక్షరాలా నిజం. ఓ నవల తరహాలో ఈ కథ సాగడం.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మట్టివాసనలు పులుముకుని అన్ని వర్గాల వారిని వారి వారి కథలోకి తీసుకెళ్తోంది. ఒకరకంగా ఇది కొత్త కథ ఏమీ కాదు. ఆస్తి తగదాల వల్ల ఊరు విడిచి వెళ్లిపోయిన ఒక వ్యక్తి ఒక శుభకార్యం కోసం ఆ ఊరికి వెళితే, అక్కడ తన మీద అతిగా ప్రేమ చూపిస్తున్న వ్యక్తి ఎవరో తెలియక ఇబ్బంది పడుతూ సాగే కథే ఇది.
ఇకపోతే.. దర్శకుడు ప్రేమ్ కుమార్ రచన అద్భుతంగా ఉంది. నిజ జీవితాన్ని తెరపై చూసిన ఫీల్ కలిగేలా.. ఫ్యామిలీతో వచ్చి చూసేలా.. ప్రేక్షకులకు ‘సాగర సంగమం’ తరహా అనుభూతిని ఇచ్చేశాడు. ‘96’ తరహాలోనే ఒక రాత్రిలో జరిగే కథగా సత్యం సుందరం తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. మన సంస్కృతి, మూలాలతో పాటు చక్కని హ్యూమర్ ఉన్న ఎమోషనల్ స్టోరీతో ఇండస్ట్రీలో మరోసారి తన మేకింగ్ తో ఆకర్షించాడు.