- 26 నుంచి అందుబాటులోకి వ్రత మండపం
- యాదగిరిగుట్టలో రూ. 17 కోట్లతో నిర్మాణం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని ఈ నెల 26న(కార్తీకమాసం ప్రారంభం) అందుబాటులోకి తేనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ఆలోపు పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదగిరిగుట్టలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.17 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. వ్రత మండపంలో విశాలమైన రెండు హాళ్లతో పాటు వాష్ రూంలు, టికెట్ కౌంటర్ హాల్, కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా ప్రత్యేక రూం నిర్మించారు. ఒక్కో హాల్ లో ఒకేసారి 2 వేల మంది వ్రత పూజలు నిర్వహించుకోవచ్చు. ఆమె వెంట ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో జూషెట్టి కృష్ణా గౌడ్, ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావు, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.