వైసీసీకి స్ట్రాంగ్ కౌంటర్‌.. సత్యవర్ధన్‌ కిడ్నాప్ వీడియో విడుదల చేసిన టీడీపీ

వైసీసీకి స్ట్రాంగ్ కౌంటర్‌.. సత్యవర్ధన్‌ కిడ్నాప్ వీడియో విడుదల చేసిన టీడీపీ

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. వంశీని కక్షపూరితంగా అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపిస్తుండగా.. అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా విజయవాడ జైల్లో ఉన్న వంశీతో మంగళవారం (ఫిబ్రవరి 18) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ములాఖత్ అయ్యారు. 

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో టీడీపీ సీనియర్  నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే.. సత్యవర్ధన్‌ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసిన సీసీ టీవీ దృశ్యాలు విడుదల చేసి వైసీపీ నేతల నోర్లు మూయించారు. 

సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు వల్లభనేని వంశీ తీసుకెళ్లారని తెలిపారు టీడీపీ నేతలు. ఈ నెల 11న హైదరాబాద్‎లోని మైహోం బుజాలో వంశీ వెంట సత్యవర్ధన్ ఉన్నారని.. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తి చేయాలనుకుంటే ఊరుకునేదిలేదని వార్నింగ్‌ ఇచ్చారు. సత్యవర్ధన్‌ను ఎలా అపహరించారో సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యం అన్నారు. వంశీతో పాటు అందరి చిట్టాలు బయటికొస్తాయని హెచ్చరించారు. ప్రశాంతమైన కృష్ణాజిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. 

 మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..  గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.  నేరస్థులకు జగన్ మద్దతిస్తున్నారని ఆరోపించిన ఆయన.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి..? అని నిలదీశారు. మీరు చేసిన అరాచకాలన్నీ బయటకొస్తాయి.. పోలీసుల బట్టలు విప్పతీస్తారా..? చట్టం ఎవర్నీ వదలదు అని వార్నింగ్‌ ఇచ్చారు. మీ బెదిరింపులకు భయపడం.. కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.