దేవరకొండ/కొండమల్లేపల్లి/ మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ మండలాల పరిధిలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, భవనాలు, రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్ రావుతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో గతంలో గిరిజనులు తమకు పుట్టిన ఆడ శిశువులను అమ్ముకునే దుస్ధితి ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అలాంటి దుర్భర స్ధితులకు దూరమయ్యారన్నారు. గిరిజన విద్యార్థులు చదువులో ముందుండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రం లో ఏడు బాలుర,15 బాలికల గిరిజన గురుకుల పాఠశాలలను ప్రారంభించిందని చెప్పారు. ఛత్తీస్ గఢ్, కర్నాటక లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ అక్కడ నెలకు రూ.700 పెన్షన్ ఇస్తూ తెలంగాణలో అధికారం లోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.
కాగా గిరిజన భవనంలో కిచెన్, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గిరిజనసంఘం ప్రతినిధులు కోరిన వెంటనే వాటి నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన మూడు రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కోరడంతో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కొండమల్లేపల్లిలో బంజారభవన్ నిర్మాణానికి రూ.50 లక్షలు,చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాలలో ఐసీడీఎస్ భవనాల నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొలుముంతల్ పహాడ్, కేశ్యతండా గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలను మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీటీడీవో రాజ్‌కుమార్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబునాయక్, లక్ష్మణ్ నాయక్, కొమ్మేపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ యేకుల రఘుపతి, నియోజకవర్గం లోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టుల
దేవరకొండలో మంత్రి పర్యటన సందర్భంగా సమ్మెలో ఉన్న కొంతమంది అంగన్వాడి టీచర్లను, వంట కార్మికులను శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కొండ మల్లేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా కొండమల్లేపల్లిలో కొందరు అంగన్వాడీలు, ఏఎన్ఎంలు మంత్రిని కలిసి తమ సమస్యలను తీర్చాలని వినతిపత్రాలు అందజేశారు.