గిరిజనుల సంక్షేమం బీఆర్​ఎస్​ తోనే సాధ్యం: సత్యవతిరాథోడ్​

నిజామాబాద్​రూరల్, వెలుగు:  గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని  మంత్రి సత్యవతిరాథోడ్​ చెప్పారు. నిజామాబాద్​ మండలం పాంగ్రా శివారులో నిర్మిస్తున్న జిల్లా బంజారా భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.   దేశంలో గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం పాటుపడుతున్న  ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్​ అని, ప్రతి గిరిజన బిడ్డా కేసీఆర్​కు రుణపడి ఉంటారని తెలిపారు.

 గిరిజనులకు స్వయంప్రతిపత్తి కల్పించాలనే లక్ష్యంతో   రాష్ట్రంలోని 3146 గిరిజన తండాలను పంచాయతీలు మార్చి పెద్ద పంచాయతీలతో సమానంగా మార్చారని కొనియాడారు.  ఒకప్పుడు గిరిజన తండాలు  అభివృద్ధికి నోచుకోలేదని, కనీసం తాగడానికి కూడా నీరు దొరకక  ఇబ్బందులు  ఉండేవన్నారు.  కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి తండా అభవృద్ది పథంలో  దూసుకుపోతోందన్నారు. గిరిజనుల రిజర్వేషన్​ను 6 నుంచి  10శాతానికి పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్​ తమ జాతిలో కొత్త వెలుగులు నింపాడని కొనియాడారు.    నిజామాబాద్​లో నిర్మిస్తున్న జిల్లా బంజారా భవన్​కు రూ.5కోట్ల నిధులు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.