ఇల్లెందు బీఆర్​ఎస్​లో ..బుజ్జగింపుల పర్వం

  • రంగంలోకి దిగిన మంత్రి సత్యవతి, ఎంపీలు కవిత, వద్దిరాజు
  • ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో అసమ్మతి నేతలతో  చర్చలు
  • ఎమ్మెల్యే భర్త తీరుపై మంత్రి, ఎంపీకి పలువురు కంప్లైంట్​  

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇల్లెందులో బీఆర్ఎస్​లో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో మంత్రి సత్యవతి రాథోడ్​, ఎంపీ కవిత,  నియోజకవర్గ ఇన్​చార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రంగంలోకి దిగారు. ఇల్లెందులోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో దాదాపు ఐదు గంటల పాటు ఎమ్మెల్యే వర్గంతో పాటు అసమ్మతి నేతలతో చర్చలు సాగించారు. అసమ్మతి వర్గం నేత, మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావును పిలిచినా ఆయన రాలేదు. దీంతో మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లి క్యాంప్​ ఆఫీస్​కు  తీసుకువచ్చారు. వెంకటేశ్వరరావు రాగానే ఎమ్మెల్యే వర్గానికి చెందిన పలువురు కౌన్సిలర్లు అలిగి బయటకు వెళ్లిపోయారు. 

ఎమ్మెల్యే భర్తపై కంప్లైంట్..

ఎమ్మెల్యే హరిప్రియకు బీ ఫాం ఇస్తే తాము పనిచేయబోమని  మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావు(డీవీ)తో పాటు  పలువురు  నేతలు అసమ్మతికి తెరలేపారు. హరిప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా తాము పనిచేస్తామని హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్లారు. అసమ్మతి నేతలు మండలాల వారీగా మీటింగ్​లు పెట్టుకున్నారు.  ఎమ్మెల్యే, ఆమె భర్త హరిసింగ్  తీరుపై మంత్రి హరీశ్ రావుకు ఇటీవల కంప్లైంట్​చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే, ఆమె భర్త తీరులో మార్పు రాకపోవడంతో కేటీఆర్​నూ కలిశారు. దాదాపు గంటన్నరకు పైగా అసమ్మతి నేతలతో కేటీఆర్​ మాట్లాడారు. కేటీఆర్​ సూచన మేరకు శుక్రవారం మంత్రి సత్యవతితోపాటూ ఎంపీలు ఇల్లందు వచ్చారు. అసమ్మతి నేతలతో  మంత్రి, ఎంపీలు మాట్లాడారు. ఎమ్మెల్యే భర్త వల్ల  తాము ఇబ్బందులు పడుతున్నామని వారు మంత్రికి వివరించారు.  నిన్నటి వరకు ఎమ్మెల్యేపై అసమ్మతి జెండా ఎగురవేసిన డీవీకి స్వాగతం పలకడంపై  కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ   మున్సిపల్ వైస్ చైర్మన్​ జానీ పాషా ఇంట్లో సమావేశమయ్యారు. 

 పార్టీ మీటింగ్​లకు తనతో వంటలు వండించి, దానికి సంబంధించిన రూ. 5లక్షలు ఇవ్వకుండా ఎమ్మెల్యే భర్త ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మీ అనే కౌన్సిలర్​  వాపోయారు. అనంతరం ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లతోనూ విడిగా మాట్లాడారు. అసమ్మతి నేతలు వ్యవహరించిన తీరుపై వారు మంత్రికి కంప్లైంట్​ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ కూడా కంటనీరు పెట్టుకున్నట్టు సమాచారం. మొత్తం మీద పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని  అసమ్మతి నేతలతో పాటు ఎమ్మెల్యే వర్గం నాయకులకు మంత్రి, ఎంపీలు సూచించారు. ​  

డీవీ భార్యకు కేటీఆర్ ఫోన్

అసమ్మతి నేత డీవీ మొండిగా ఉండకూడదని, ఆయనకు మీరైనా నచ్చచెప్పండంటూ డీవీ భార్యకు మంత్రి కేటీఆర్ ఫోన్​ చేసి మాట్లాడారు.  ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్​ అమలులో ఉన్న టైంలో పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ వేదిక అయినప్పటికీ ఆఫీసర్లు ఎటువంటి చర్య తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.