వన్యప్రాణుల దూప తీరుస్తున్న సాసర్ పిట్లు

ఖానాపూర్, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ఖానాపూర్ రేంజ్ లో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సాసర్ పిట్ లు వన్య ప్రాణుల దాహార్తి తీర్చుతున్నాయి. సాసర్ పిట్​ల వద్దకు నీరు తాగేందుకు వచ్చిన జంతువుల ఫొటోలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిక్కాయి. ఈ ఫొటోలను ఖానాపూర్ ఫారెస్ట్ రేంజర్ జి.వినాయక్ విడుదల చేశారు. రేంజ్ పరిధిలో చిరుతతో పాటు దుప్పులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, నీలగాయిలు ఉన్నాయని తెలిపారు. అటవీ శాఖ అధికారుల అనుమతులు లేకుండా ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు.