Saud Shakeel: బ్యాటింగ్‌కు రాకుండా నిద్రపోయిన పాక్ క్రికెటర్.. ఔట్ ఇచ్చిన అంపైర్

Saud Shakeel: బ్యాటింగ్‌కు రాకుండా నిద్రపోయిన పాక్ క్రికెటర్.. ఔట్ ఇచ్చిన అంపైర్

రావల్పిండి వేదికగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ టెలివిజన్ మధ్య జరుగుతున్న ప్రెసిడెంట్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన ఒకటి వైరల్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తరపున ఆడుతున్న సౌద్ షకీల్ టైం అవుట్ కారణంగా బ్యాటింగ్ కు దిగకుండానే ఔట్ అయ్యాడు. మొదట బ్యాటింగ్ చేస్తూ వికెట్ నష్టానికి 128 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఎస్‌బిపి వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ షాజాద్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో 5వ స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సిన సౌద్ షకీల్ క్రీజ్ లోక్ రాలేదు. అతను ఆ సమయంలో నిద్ర మత్తులో ఉన్నట్టు సమాచారం.

నిర్ణీత సమయంలో బ్యాటింగ్ కు రాకపోవడంతో ప్రత్యర్థి కెప్టెన్ అమద్ బట్ వెంటనే అప్పీల్ చేయడంతో అంపైర్లు షకీల్ ను బ్యాటింగ్ చేయడానికి అనర్హుడిగా ప్రకటించారు. దీంతో టైం అవుట్ కారణంగా ఔటైన తొలి పాకిస్థాన్ ప్లేయర్ గా సౌద్ షకీల్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ చరిత్రలో ఇలా మొత్తం ఏడుగురు ఔటయ్యారు. సౌద్ షకీల్ ఇటీవలే టీమిండియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి పాకిస్థాన్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్థాన్ టెస్ట్ జట్టులో నిలకడగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.      

ఏంటి టైమ్డ్‌ ఔట్‌..?

మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్ (ఎంసీసీ) నిబంధన 40.1.1 ప్రకారం.. ఒక బ్యాటర్‌ ఔటైనా లేదా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్‌ 3 నిమిషాల్లోపు(180 సెకన్లు) బంతిని ఫేస్‌ చేయాలి. లేనియెడల ఇన్‌కమింగ్‌ బ్యాటర్‌ను టైమ్డ్‌ ఔట్‌ కింద అంఫైర్లు ఔట్‌గా ప్రకటిస్తారు.

ALSO READ : Mushfiqur Rahim: రెండు రోజుల్లో ఇద్దరు గుడ్ బై: 19 ఏళ్ళ కెరీర్‌కు మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైన క్రికెటర్లు వీరే:

ఆండ్రూ జోర్డాన్: టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైన మొదటి బ్యాటర్ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండ్రూ జోర్డాన్ పేరిట ఉంది. 1988లో ఈస్ట్ ప్రావిన్స్-ట్రాన్స్‌వాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్ ఈ విధంగా ఔటయ్యారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. వరదల కారణంగా జోర్డాన్‌ స్టేడియానికి చేరుకోవడం లేట్‌ అయ్యిందట.


హేములాల్ యాదవ్: ఈ పద్ధతిలో ఔటైన తొలి భారత క్రికెటర్, రెండో బౌలర్ హేమలాల్ యాదవ్. 1997లో ఒడిశా- త్రిపుర మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హేమలాల్ ఈ విధంగా ఔటయ్యారు. 9వ వికెట్ కోల్పోయాక అంపైర్లు ఇరు జట్లకు డ్రింక్స్‌ విరామం ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రారంభం కాగా, అతను సమయానికి క్రీజులోకి చేరుకోలేదు. కొద్దిసేపటి అనంతరం అతను క్రీజులోకి చేరుకున్నా.. అప్పటికే అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. 

వాస్బర్ట్ డ్రేక్స్: గత ఉదాహారణలతో పోలిస్తే డ్రేక్స్ ఔటైన తీరు విచిత్రమైనది. విమానం ఆలస్యం కారణంగా ఇతను సకాలంలో స్టేడియానికి చేరుకోలేకపోయారు. ఫలితంగా అంపైర్లు అతన్ని టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔట్‌గా ప్రకటించారు. 2002-03లో సూపర్‌స్పోర్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఆండ్రూ హారిస్: టైమ్ అవుట్ రూపంలో ఔటైన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్, తొలి బ్యాటర్.. ఆండ్రూ హారిస్. 2003లో నాటింగ్‌హామ్‌షైర్- డర్హామ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతను ఔటయ్యాడు. మొదట బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డ హారిస్.. వైద్యుల సలహాతో డెస్సింగ్ రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. చివరకు అతనికి బ్యాటింగ్ చేయాల్సిందిగా సమాచారం వచ్చినప్పటికీ..  ప్యాడ్‌లు చేత పట్టుకుని మెట్లు దిగే సమయానికి.. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు మైదానం నుండి బయటికి వచ్చేశారట.

ర్యాన్ ఆస్టిన్: ఈ విధంగా ఔటైన మరో క్రికెటర్ ర్యాన్ ఆస్టిన్ (వెస్టిండీస్‌). 4 డే మ్యాచ్ లో ఆస్టిన్ ఔటైనట్లు సమాచారం ఉంది.

చార్లెస్ కుంజే: జింబాబ్వే క్రికెటర్ చార్లెస్ కుంజే కూడా  టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైనప్పటికీ.. ఎలా జరిగిందనేది అస్పష్టంగా ఉంది. 2017-18లో లోగాన్ కప్‌లో భాగంగా బులవాయో మౌంటెనీర్స్‌- మతాబెలెలాండ్ టస్కర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.