హజ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఇద్దరు భారతీయ హజ్ యాత్రికులు మరణించారు. 2024, జూన్ 6, గురువారం మక్కా, అజీజియా జిల్లాలో లిఫ్ట్ కూప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన యాత్రికులను కతిహార్ జిల్లాకు చెందిన ఎండీ సిద్ధిక్(74), బీహార్‌లోని కిషన్ గంజ్ చెందిన ఎండీ అబ్దుల్ లతీఫ్(64)గా గుర్తించారు.
బాధితులకు సమాచారం ప్రకారం.. అజీజియా జిల్లాలో భారతీయ యాత్రికులకు భవనం నెంంబర్145లో వసతి కల్పించారు. ఈక్రమంలో ఒక యాత్రికుడు సెల్లార్‌లోని ఎలివేటర్ షాఫ్ట్ నుండి కింద పడి తీవ్ర గాయాలతో మరణించగా, మరొకరు లిఫ్టు తలుపుల మధ్య ఇరుక్కొని.. నలిగి చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరికొంత మంది యాత్రికులు కూడా గాయపడ్డారని మొదట వార్తలు వచ్చాయి. అయితే మిగిలిన యాత్రికులకు ఎటువంటి గాయాలు కాలేదని, వారు సురక్షితంగా ఉన్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే, యాత్రికుల మరణాలను భారత అధికారులు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఈ ప్రమాదం అనంతరం.. అదే రోజు సాయంత్రం భవనం నుంచి యాత్రికులను సమీపంలోని మరో భవనంలోకి తరలించినట్లు సమాచారం.అయితే, బీహార్‌కు చెందిన మెజారిటీ హజ్ యాత్రికులు తమ వసతి గృహాలలో కనీస సౌకర్యాలు కూడా లేవని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.